దీర్ఘకాలిక వ్యాధుల మందుల ధరల తగ్గింపు

దీర్ఘకాలిక వ్యాధుల మందుల ధరల తగ్గింపు
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా 35 రకాల మందుల ధరలను తగ్గించింది. దేశ ప్రజలకు ప్రజలకు మందులను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్ పీపీఏ) ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు విక్రయిస్తున్న 35 ఔషధాల రిటైల్‌ ధరలను తగ్గించింది. 
 
ఈ ఒంటినొప్పులు, గుండెసంబంధిత, మధుమేహం, మానసిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై తగ్గింపు వర్తించనున్నది. దాంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఊరట కలగనుంది.  ఈ మేరకు రసాయనాలు-ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులను మేరకు జారీ చేసింది.  యేసిలోఫెనాక్, పారాసెటమాల్‌, ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ ఫిక్స్‌డ్‌-డోస్‌ కాంబినేషన్‌, అమోక్సిసిలిన్-పొటాషియం క్లావ్యులానేట్‌, అటోర్వాస్టాటిన్‌, ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్‌ఫార్మిన్ వంటి మందులున్నాయి.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ విక్రయించే యేసిలోఫెనాక్-పారాసెటమాల్-ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ మాత్ర ధరను రూ.13గా నిర్ణయించింది. క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ విక్రయించే అదే ఫార్ములేషన్ ధరను 15.01గా పేర్కొంది. గుండె సంబంధిత వ్యాధులున్న వారు విస్తృతంగా వాడే మెడిసిన్‌ అయిన అటోర్వాస్టాటిన్ 40 ఎంజి + క్లోపీడొగ్రెల్ 75 ఎంజి మాత్రల ధరలను రూ.25.61గా నిర్ణయించింది. 

చిన్నపిల్లలకు ఉపయోగించే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్‌ సస్పెన్షన్స్‌, విటామిన్‌ డీ లోపం ఉన్న వారిలో వాడే కోలికాల్సిఫెరాల్ డ్రాప్స్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ధర రూ.31.77కి తగ్గించింది. రిటైర్లు, డీలర్లు అందరూ మెడికల్‌ షాపుల్లో తాజా ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది. ఎక్కువకు ధరకు ఆయా మందులను విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఔషధ ధరల నియంత్రణ ఆర్డినెన్స్ (డిపిసిఓ) 2013, ఎసెన్షియల్‌ కమెడిటీస్‌ యాక్ట్‌ 1955 ప్రకారం జరిమానాలు విధించనున్నట్లు తెలిపింది. ఆయా మెడిసిన్ల ధరలు మినహాయించామని, అదనంగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఔషధ తయారీ కంపెనీలు కొత్త ధరల జాబితాను ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో అప్‌డేట్‌ చేసి.. ఎన్‌పీపీఏ, రాష్ట్రాల డ్రగ్‌ కంట్రోలర్స్‌కు సమర్పించాలని ఆదేశించింది. తాజా ఆదేశాలతో ఆయా ఔషధాలపై ఇప్పటికే ఉన్న ధరల ఉత్తర్వులు రద్దయినట్లు స్పష్టం చేసింది.