600 ఏళ్లలో రష్యాలో మొదటిసారి అగ్నిపర్వతం విస్ఫోటనం

600 ఏళ్లలో రష్యాలో మొదటిసారి అగ్నిపర్వతం విస్ఫోటనం
రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. కురిల్ దీవులలో ఆదివారం సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్), జపాన్‌ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ పలు తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి వివరాలు తెలియరాలేదు. 
ఈ భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు ఊగిపోయాయని, ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు రష్యా మీడియా పేర్కొంది. రష్యాలోని కమ్చట్కాలోని క్రాషెనిన్నికోవ్‌ అగ్ని పర్వతం శనివారం రాత్రి బద్ధలైంది. 600 ఏళ్లలో మొదటిసారి అగ్ని పర్వతం విస్ఫోటనం చెందినట్లు కమ్చట్కా అగ్నిపర్వత విస్ఫోటన ప్రతిస్పందన బృందం అద్యక్షులు ఓల్గా గిరినా పేర్కొన్నారు. గత బుధవారం సంభవించిన భూకంపం ఈ విస్ఫోటనానికి కారణమై ఉండవచ్చని తెలిపారు. 
 
దీంతో ఫ్రెంచ్‌పాలినేషియా, చిలీ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని, ఆ తర్వాత కమ్చట్కాలో అత్యంత చురుకైన క్రాషెనిన్నికోవ్‌ అగ్ని పర్వతం బద్దలైందని అన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత 6,000 మీటర్లు (3.7మైళ్లు) ఎత్తుకు బూడిద పొగమంచులా ఎగిసిపడుతున్నట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది. బూడిత తూర్పు దిశగా పసిఫిక్‌ మహాసముద్రం వైపుగా వెళ్లిందని, ఈ ప్రాంతంలో జనసాంద్రత ఉన్న ప్రాంతాలు లేవని చెప్పారు.  
ఈ అగ్ని పర్వతం 1,856మీటర్ల ఎత్తులో ఉంది. 1463లో (40 ఏళ్లు అటు ఇటుగా ) ఈ అగ్ని పర్వతం బద్దలైందని తెలిపారు. నిద్రాణ అగ్నిపర్వతం అంటే ప్రస్తుతం చురుకుగా లేని అగ్నిపర్వతం. కానీ భవిష్యత్తులో పేలే అవకాశం ఉంటుంది. కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం చాలా కాలంగా ప్రశాంతంగా, నిద్రాణంగా ఉంది. కానీ ప్రస్తుత భూకంపం ప్రభావంతో అది బద్దలైంది. ఇలాంటి అగ్నిపర్వతాలనే నిద్రాణమైన అగ్నిపర్వతాలు అని అంటారు.

రష్యా తీరంలో సంభవించిన ఈ భూకంపం (8.8 తీవ్రత) అధునిక ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటని యూఎస్జీఎస్ పేర్కొంది. అయితే ఈ భూకంపం తర్వాత వరుసగా పలుమార్లు భూమి కంపించందని, అందులో రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతో సంభవించిన ఓ భూకంపం కూడా ఉందని తెలిపింది. ఈ భారీ భూప్రకంపనల ధాటికి రష్యా, జపాన్‌లతో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు దేశాల తీర ప్రాంతాలను సునామీ తాకింది. పసిఫిక్‌ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు తెలిపారు.