
లగేజీకి అదనపు ఛార్జీ చెల్లించాలన్న స్పైస్ జెట్ ఉద్యోగులపై ఆర్మీ అధికారి ఒకరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఉద్యోగి వెన్నెముక విరిగిపోగా, మరో ఉద్యోగి దవడ ఎముకకు తీవ్ర గాయమైనట్లు స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గతవారం శ్రీనగర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం సీనియర్ ఆర్మీ అధికారి 16 కిలోల బరువు కలిగిన రెండు క్యాబిన్ లగేజీలు తీసుకువెళ్తున్నాడు. సాధారణంగా 7 కిలోల వరకు విమానంలోకి అనుమతిస్తారు. లగేజీ రెట్టింపు బరువు ఉండటంతో సిబ్బంది అదనపు ఛార్జీ చెల్లించాల్సి వుందని స్పైస్ జెట్ సిబ్బంది తెలిపారు. అయితే అతను నిరాకరించి, బోర్డింగ్ పూర్తికాకుండానే ఏరోబ్రిడ్జిలోకి ప్రవేశించాడు.
ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించడమేనంటూ సిబ్బంది అతన్ని అడ్డుకుని తిరిగి గేటు వైపు తీసుకువెళ్లాడు. ఆగ్రహించిన ఆర్మీ అధికారి గ్రౌండ్ సిబ్బందిపై దాడి చేశాడు. ఒక ఉద్యోగి నేలపై స్పృహ కోల్పోయినప్పటికీ కొట్టడం ఆపలేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు స్పైస్ జెట్ సిబ్బందిపైనా ఆర్మీ అధికారి దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, ఒకరికి వెన్నెముక విరిగిందని స్పైస్ జెట్ తెలిపింది.
చివరకు ఆ ఆర్మీ అధికారిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిలువరించారని పేర్కొంది. కాగా, ఈ సంఘటనపై పోలీసులకు స్పైస్ జెట్ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఆర్మీ అధికారిపై హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా ఈ సంఘటనపై స్పందించింది. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని వెల్లడించింది. మరోవైపు స్పైస్ జెట్ సిబ్బందిపై ఆర్మీ అధికారి హింసాత్మకంగా దాడి చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆర్మీ అధికారి కూడా ప్రత్యుత్తర ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్పైస్‌జెట్ అధికారులు పోలీసులకు సమర్పించారు. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే ఈ చర్యను తీవ్రంగా తీసుకోవాలని స్పైస్‌జెట్ డీజీసీఏకు విజ్ఞప్తి చేసింది. ఆ అధికారిని వెంటనే ‘నో-ఫ్లై లిస్టు’లో చేర్చాలని కోరింది. విమానయానంలో భద్రత ప్రాధాన్యత అని స్పష్టంగా తెలియజేసింది. అయితే సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఆర్మీ అధికారికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.
More Stories
చట్టవిరుద్ధమని తేలితే బిహార్‌లో ఎస్ఐఆర్ ను రద్దు చేస్తాం
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి
జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్ హోమ్స్