విజయవాడ- హైదరాబాద్‌కు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే

విజయవాడ- హైదరాబాద్‌కు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే
విజయవాడ-హైదరాబాద్‌కు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. మంగళగిరి సికె కన్వెన్షన్‌ హాల్‌లో శనివారం సాయంత్రం 29 ప్రాజెక్టులు రూ.5,223 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లతో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్పవాలు చేశారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. రూ.6,700 కోట్లతో హైదరాబాద్‌- విజయవాడ రోడ్డు 6 లైన్లు, రూ.2,600 కోట్లతో విజయవాడ-మచిలీపట్నం 6 లైన్ల రోడ్డు, రూ.2 వేలకోట్లతో వినుకొండ-గుంటూరు 4 లైన్ల రోడ్డు, రూ.4,200 కోట్లతో గుంటూరు-నిజాంపట్నం 6 లైన్ల రోడ్డు, బుగ్గకయిప-గిద్దలూరు మధ్య రూ.4,200 కోట్లతో 4 లైన్ల రోడ్డు, రూ.2,500 కోట్లతో ఆకివీడు-దిగుమర్రు 4 లైన్ల రోడ్డు, రూ.4,200 కోట్లతో పెడన-లక్ష్మీపురం 4 లైన్ల రోడ్డు, ముద్దనూరు-కడప 4 లైన్ల రోడ్లు కోసం రూ.1,182 కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నట్లు నితిన్‌ గడ్కరీ సభా వేదికపై నుంచి ప్రకటించారు. 
 
దేశంలో నీటి లభ్యతకు కొరత లేదని, నీటి నిర్వహణే పెద్ద సమస్య అని చెప్పారు. గోదావరి నుంచి పెద్దయెత్తున నీరు సముద్రంలో కలుస్తోందని, ఆ నీటిని కృష్ణా, పెన్నా మీదుగా కావేరి వరకు తీసుకెళ్లవచ్చని సూచించారు. చంద్రబాబు విజనరీ లీడర్‌ అని ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రానికి పోర్టులు, షిప్‌ యార్డులు పెద్ద సంపద అని పేర్కొన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎనర్జీని అందుబాటులోకి తెస్తే తక్కువ ఖర్చుతో పాటు పొల్యూషన్‌ సమస్యలు లేకుండా ఉంటాయని తెలిపారు.
 
సిఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరానికి గడ్కరీ ఇచ్చిన ప్రోత్సాహాన్ని తాను ఎన్నటికీ మరచిపోనని చెప్పారు. దేశంలో నిత్యం 37 కిలోమీటర్లు హైవే పనులు జరుగుతున్నాయని, దానిని రూ.50 కిలోమీటర్లకు గడ్కరీ తీసుకెళ్తారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి లాజిస్టిక్‌ హబ్‌లు తేవడమే తమ లక్ష్యమని చెప్పారు. బయో ఇంధనం ఉత్పత్తిలోనూ వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
 
డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ జాతీయ రహదారుల అభివృద్ధి స్ఫూర్తితో అడవి తల్లిబాటకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గిరిజన గ్రామాలకు వసతులు, ఉపాధి మార్గాలకు ప్రణాళి కలు రచించడంతోపాటు డోలీ మోతలు లేని ఏజె న్సీలే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు కాసుకుని కూర్చున్నారని హెచ్చరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మరో 15 ఏళ్లు కూటమి కలిసి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. 
 
కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు జనార్ధన్‌రెడ్డి, సత్యకుమార్‌ యాదవ్‌ ప్రసంగించారు. ఎంపిలు దగ్గుబాటి పురందేశ్వరి, సిఎం రమేష్‌, కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవ రాయలు, ఎన్‌టిఆర్‌, గుంటూరు జిల్లాల ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ జక్రియా ఖానం, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్‌ మాధవ్‌ పాల్గొన్నారు.