మాజీ ప్రధాని మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవిత ఖైదు

మాజీ ప్రధాని మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవిత ఖైదు
లైంగిక దాడి కేసులో మాజీ ఎంపీ, హెచ్‌డీ దేవేగౌడ మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణకు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవితై ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. ఓ తనపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడినట్లు మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.  తాజాగా కోర్టు శనివారం ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది.
ప్రజ్వల్ రేవణ్ణపై నాలుగు అత్యాచార కేసులు ఉన్నాయి. ఈ కేసులో ప్రజ్వల్ ఇప్పటికే 14 నెలలుగా జైలు జీవితం గడిపారు.  మైసూర్‌లోని కేఆర్‌ఎస్‌ నగర్‌కు చెందిన పని మనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ను దోషిగా తేలుస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ తీర్పును వెలువరించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది జగదీష్‌ వాదనలు వినిపించారు. 
 
ప్రజ్వల్‌ చర్య నీచమైందని, జీవనోపాధి కోసం పని కోసం వచ్చిన చదువు రానివారిపై దారుణ చర్యకు పాల్పడ్డాడని, వీడియోలు చిత్రీకరించడం బాధితురాలిని మానసికంగా కూడా హింసించడమేనని, ఓ దశలో బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించిందని కోర్టుకు తెలిపారు. ప్రజ్వల్‌పై మరో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాదనలు వినిపించారు. ప్రజ్వల్‌ రాజకీయాల్లోకి కేవలం డబ్బు కోసమే రాలేదని, ప్రజ్వల్‌ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు వీడియోలు దురుద్దేశంతో లీక్‌ చేశారని, అతని రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారంటూ వాదనలు వినిపించారు. ప్రజ్వల్ ఏడాది జైలులో ఉన్నాడని, ఈ కేసుతో అతనికి తీవ్రమైన నష్టం జరిగిందని తెలిపారు. అతని కెరీర్‌కు ఇబ్బందికలిగేలా శిక్ష విధించొద్దని కోరారు. ఈ సందర్భంగా ప్రజ్వల్‌ రేవణ్ణ కోర్టు ఎదుట మాట్లాడుతూ తనపై చాలా మంది ఇలాంటి ఆరోపణలు చేశారని, తాను ఎంపీగా ఉన్న సమయంలో ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.తాను అత్యాచారం చేసి ఉంటే వాళ్లు ఎవరికీ ఎందుకు చెప్పలేదని, లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎందుకు ఆరోపణలు చేశారని పేర్కొంటూ పోలీసులు కావాలని ఇలా చేశారంటూ ప్రజ్వల్‌ కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. తాను మెకానికల్ ఇంజినీరింగ్‌ చదివానని, గత ఆరు నెలలుగా తల్లిదండ్రులను చూడలేదని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. 

శిక్ష విధించే సమయంలో కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ప్రజ్వల్‌ను దోషిగా ప్రకటించింది. జీవిత ఖైదు విధించడంతో పాటు రూ.5లక్షల జరిమానా విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్‌కు జీవిత ఖైదు విధించడంతో రాజకీయ జీవితం తెరపడ్డట్లేనని భావిస్తున్నారు.