ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పోక్సో కేసులో అరెస్ట్

ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ పోక్సో కేసులో అరెస్ట్
లైంగిక వేధింపుల ఆరోపణలు టాలీవుడ్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ ఘటన తాలూకు సంఘ‌ట‌న‌లు మ‌ర‌వ‌క ముందే, ఇప్పుడు మరో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కృష్ణపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ‘ఢీ’, ‘బీబీ జోడీ’, ‘డాన్స్ ఐకాన్’ వంటి పాపులర్ షోలతో గుర్తింపు పొందిన కోరియోగ్రాఫర్ కృష్ణ  ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో, హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదైంది.
బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద పోస్కో కేసు నమోదు చేశారు.  ఈ ఘటన జ‌రిగి చాలా రోజులు అవుతున్నా ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  కేసు నమోదు చేసిన వెంటనే కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో బెంగళూరులో అతని అన్న ఇంట్లో తలదాచుకున్నాడని గుర్తించిన పోలీసులు, అక్కడే అరెస్ట్ చేశారు. అనంతరం తెలంగాణలోని కంది జైలుకు తరలించారు.  ప్రస్తుతం కృష్ణ మాస్టర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. 
 
ఇది కృష్ణ మాస్టర్‌పై వచ్చిన మొదటి ఆరోపణ కాదు. గతంలోనూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతులు, మహిళలతో పరిచయాలు పెంచుకుని మోసం చేశాడని పలు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే కృష్ణ మాస్టర్‌కు ఓ మహిళతో వివాహం కూడా జ‌రిగింది. భార్యకు సంబంధించిన రూ.9.50 లక్షలు నగదు తీసుకుని పరారైన‌ట్టు స‌మాచారం. 
ఇలా కొరియోగ్రాఫర్లపై ఇలా వరుసగా లైంగిక ఆరోపణలు రావడం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిశ్రమలో మహిళల భద్రతపై, మైనర్ బాలికల హక్కులపై మరోసారి చర్చ మొదలైంది.