అనిల్ అంబానీపై బ్యాంకు మోసం కేసులో తొలి అరెస్ట్!

అనిల్ అంబానీపై బ్యాంకు మోసం కేసులో తొలి అరెస్ట్!

అనిల్ అంబానీపై రూ.3,000 కోట్ల రుణ మోసం(లోన్ ఫ్రాడ్) కేసులో శనివారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తొలి అరెస్టు చేసింది. బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ (బీటీపీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002 నిబంధనల కింద అదుపులోకి తీసుకున్నారు.  నకిలీ  బ్యాంక్ గ్యారెంటీని సులభతరం చేసినందుకు అనిల్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ నుంచి బీటీపీఎల్ రూ.5.4కోట్లు పొందినట్లు ఈడీ వెల్లడించింది.

ఈ ఆర్థిక లావాదేవీ,  బీటీపీఎల్ మోసపూరిత కార్యకలాపాలను అంబానీ కార్పొరేట్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే కీలక అంశమని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసు జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. ముందస్తు అనుమతి లేకుండా అనిల్ అంబానీ భారతదేశం విడిచి వెళ్లడానికి వీలు లేదని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ అనిల్ అంబానీ విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తే, అతన్ని విమానాశ్రయాలు లేదా ఓడరేవులలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కోట్లాది రూపాయల బ్యాంకు రుణ మోసంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై ఆగస్టు 5న విచారణ కోసం ఈడీ ఇప్పటికే రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్‌కు సమన్లు జారీ చేసింది.