మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.  గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్కినేని నాగచైతన్య- సమంత విడిపోవడానికి కెటిఆరే కారణం అంటూ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.
 
దానితో తనపై అనుచిత వాఖ్యలు చేశారని అంటూ పరువు నష్టం కేసు నమోదు చేస్తూ కేటీఆర్‌ కోర్టును గత ఏడాది అక్టోబర్ 10న ఆశ్రయించారు. కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై ఆగస్టు 21లోగా క్రిమినల్ కేసు నమోదు చేసి నిందితురాలికి నోటీసు జారీ చేయాలని స్పష్టం చేసింది. 
 
కేటీఆర్‌పైన మంత్రి నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌ తరఫున న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది.  న్యాయస్థానంలో ఇప్పటివరకు కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ విచారణకు స్వీకరించాలా వద్దా అన్న అంశంపై వాదనలు జరిగాయి. ఫిర్యాదుతో పాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లను న్యాయమూర్తి పరిశీలించారు. కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవద్దని, కొండా సురేఖ వ్యాఖ్యలు పరువునష్టం కిందకు రావని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. 

కొండా సురేఖ మాట్లాడిన అంశాలు అప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయని తెలిపారు. కేటీఆర్‌తో పాటు సాక్ష్యులుగా ఉన్న బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. ఇరువైపుల వాదనలు, సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన న్యాయస్థానం, కేటీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఈనెల 21కి వాయిదా వేసింది.

 కోర్టు నిర్ణయంపై మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ దేశ న్యాయ వ్య‌వ‌స్థ మీద అపార‌మైన గౌర‌వం ఉందని చెప్పారు. ఇలాంటి కేసులు, కొట్లాట‌లు తనకు కొత్త కాదని, తన జీవిత‌మే ఒక పోరాటమని ఆమె పేర్కొన్నాన్నారు.