అమెరికాలో కార్పొరేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టింగ్ మూసివేత

అమెరికాలో కార్పొరేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టింగ్ మూసివేత
విదేశాలకు మానవతా సాయం అందిస్తున్న యూఎస్‌ ఎయిడ్‌ సంస్థను మూసేసిన అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈసారి తన ప్రతాపాన్ని కార్పొరేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ (సిపిబి) సంస్థపై చూపించారు. ఇది లాభాపేక్ష లేని సంస్థ. ఫెడరల్‌ నిధులను దేశంలోని ప్రభుత్వ రేడియో, టీవీ కేంద్రాలకు పంపిణీ చేస్తుంటుంది.  అయితే ట్రంప్‌ తన నిధులలో కోత పెట్టడంతో సంస్థను మూసివేయబోతున్నట్లు సీపీబీ ప్రకటించింది.
తనకు అందజేస్తున్న నిధులలో సుమారు 1.1 బిలియన్‌ డాలర్లు కోత పెట్టడంతో కార్యకలాపాలను నిలిపివేయడం మినహా మరో దారి లేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
“సిపిబికి ఎప్పటి మాదిరిగానే నిధులు అందజేయాలంటూ లక్షలాది మంది అమెరికన్లు ప్రతినిధి సభకు లేఖలు రాసినా, అభ్యర్థనలు పంపినా, మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. మా కార్యకలాపాలను మూసివేసుకోవడం మినహా మరో దారి లేదు. ఇది వాస్తవం” అని సంస్థ అధ్యక్షులు పాట్రిసియా హర్రిసన్‌ తెలిపారు. 
 
సిబ్బందికి తగ్గించుకుంటున్నామని, మరో ఆరు నెలల పాటు మాత్రమే కార్యకలాపాలు నడిపిస్తామని ఆయన చెప్పారు. సిబ్బందిలో ఎక్కువ మంది సెప్టెంబర్‌ 30న విధుల నుంచి వైదొలుగుతారని, కేవలం కొద్ది మంది మాత్రమే వచ్చే సంవత్సరం జనవరి వరకూ ఉంటారని వివరించారు. ట్రంప్‌ ప్రభుత్వం రెండు కార్యనిర్వాహక చర్యల ద్వారా సిపిబి సంస్థకు గత నెలలో సమాధి కట్టింది.
 
గతంలో నిధుల విడుదలకు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం ఓ చట్టం ద్వారా రద్దు చేసింది. అంతకుముందు సెనెట్‌ ఈ బిల్లును 51-48 ఓట్లతో ఆమోదించింది. ప్రతినిధుల సభ కూడా 216-213 ఓట్లతో ఆమోదం తెలిపింది. అమెరికా చరిత్రలో గత ఐదు దశాబ్దాల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.  నేషనల్‌ పబ్లిక్‌ రేడియో (ఎన్‌పిఆర్‌), పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీస్‌ (పిబిఎస్‌) వార్తా సంస్థలు వామపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్‌, ఆయన మిత్రులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఎన్‌పిఆర్‌కు 4.3 కోట్ల మంది శ్రోతలు ఉన్నారు. పిబిఎస్‌ తన టీవీ కార్యక్రమాల ద్వారా ఏటా 13 కోట్ల మందిని చేరుతోంది.