గొర్రెల పంపిణీలో రూ.వెయ్యి కోట్లపైనే అక్రమాలు

గొర్రెల పంపిణీలో రూ.వెయ్యి కోట్లపైనే అక్రమాలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీలో రూ.వెయ్యి కోట్లపైనే అక్రమాలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అప్పటి ఓఎస్డీ కల్యాణ్‌ ఇంట్లో ఈడీ అధికారులు కేసు సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారు. 200కు పైగా బ్యాంకు అకౌంట్లకు చెందిన పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 

అవే బ్యాంకు ఖాతాలను బెట్టింగ్‌ అప్లికేషన్లలోనూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈడీ సోదాల్లో 31 సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులు లభించాయి. నిజమైన లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు వెళ్లాయన్న ఈడీ, గొర్రెల పంపిణీలో తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఈడీ జులై 30వ తేదీనే హైదరాబాద్‌లో ఆరుచోట్ల సోదాలు చేపట్టింది.

పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్‌ రామచందర్‌ నాయక్‌, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్‌, పలువురి ఇళ్లలో అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేశారు. మొదటగా ఈ కుంభకోణంపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. గొర్రెల పంపిణీతో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఈడీ తాజాగా గుర్తించింది. 2015లో అప్పటి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది అర్హులైనవారికి సుమారు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు రికార్డులలోని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో మొదటి నుంచి కొందరు అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులను దోచుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది.  కొంత మంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి, ఆ నిధుల్ని ఈ దళారుల ముఠా స్వాహా చేసింది.

ఈ నిధులను బినామీ ఖాతాల్లోకి మళ్లించి అందరూ కలిసి వాటాలేసుకుని మరి పంచుకున్నట్లు వెల్లడైంది. ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ, ఈడీ సంస్థలు అనుమానిస్తున్నాయి. గొర్రెల గోల్‌మాల్‌ వ్యవహారంపై ఈడీ ఒక్కసారిగా రంగంలోకి దిగడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అక్రమార్కులకు గుండెల్లో గుబులు పట్టుకుంది. గొర్రెల పంపిణీలో రూ.కోట్ల అక్రమాలపై అప్పట్లోనే కేసుల నమోదు జరిగింది. నిధుల గోల్మాల్ చేసిన అధికారుల సస్పెన్షన్లు కూడా జరిగాయి.

 తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు హైదరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు చేయడం, అక్రమాలు ఎక్కువ జరిగిన జిల్లాలపై దృష్టి సారించనుండటంతో అందులో పాలుపంచుకున్న వారిలో కలవరం మొదలైంది.