మహాదేవ్ ఆశీర్వాదంతో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం

మహాదేవ్ ఆశీర్వాదంతో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం

* పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ తన రుద్ర రూపాన్ని ప్రదర్శించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత్​పై దాడి చేసే వారిని పాతాళంలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదనే సంకేతం ఇచ్చిందని పేర్కొంటూ ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పహల్గాం ఉగ్రదాడిలో జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకున్నామని పేర్కొన్నారు.  ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ప్రధాని మోదీ వారణాసిలో రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు మాట్లాడారు.

“పహల్గాం దాడిలో 26 మంది అమాయక పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపారు. నా కుమార్తెల సిందూరానికి ప్రతీకారం తీర్చుకుంటానని నేను ప్రతిజ్ఞ చేశా. ఆ మహాదేవ్ ఆశీర్వాదంతో దానిని నెరవేర్చాను. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని మహాదేవ్ పాదాలకు అంకితం చేస్తున్నా. శివుడు మంగళకరమైనవాడు. కానీ ఉగ్రవాదం తలెత్తినప్పుడు ఆ మహాదేవుడు రుద్ర రూపం ధరిస్తాడు. ఆపరేషన్ సిందూర్​ సమయంలో భారతదేశం కూడా అదే రుద్ర రూపాన్ని ప్రపంచానికి చూపింది” అని ప్రధాని వెల్లడించారు. 

“140 కోట్ల మంది ప్రజల ఐక్యతే ఆపరేషన్​ సిందూర్​కు బలంగా మారింది. ఆపరేషన్ సిందూర్​ సమయంలో మనం అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు, డ్రోన్లు, గగన రక్షణ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో ప్రపంచం చూసింది. మన బ్రహ్మోస్ క్షిపణి వల్ల పాక్ ప్రజలు నిద్రపట్టక భయపడుతున్నారు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను భారత్​ ధ్వంసం చేయగలగిందన్న విషయాన్ని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు.

“ఆపరేషన్​ సిందూర్​ పట్ల గర్వపడటం లేదా? పాక్​లోని ఉగ్రస్థావరాలను నాశనం చేయడంలో భారత విజయం పట్ల గర్వించకపోతే ఏం చేస్తారు?” అని ప్రధాని మోదీ  ప్రశ్నించారు. “మన డ్రోన్లు, క్షిపణులు పాక్​ స్థావరాలను ఎలా ధ్వంసం చేశాయో మీరు చూసే ఉంటారు. కొన్ని వైమానికి స్థావరాలు ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. పాక్​ బాధపడటం సహజమే, కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలూ దీనిని తట్టుకోలేకపోతున్నారు” అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ మన జవాన్ల ధైర్యాన్ని తక్కువచేసి, ఆపరేషన్ సిందూర్​ను తమాషా అని అభివర్ణించడం తగదని ప్రధాని హితవు చెప్పారు. “సిందూర్ అనేది మా చెల్లెమ్మల పవిత్ర గుర్తు. దానిని ఎవరూ అపహాస్యం చేయలేరు” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొందని ప్రధాని మోదీ చెబుతూ అన్ని దేశాలు తమ స్వప్రయోజనాలపై దృష్టి సారించి ముందుకు వెళుతున్నాయని చెప్పారు. 
 
ఈ దిశలోనే పౌరులు కూడా దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. “ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో అస్థిరత నెలకొంది. అన్ని దేశాలు వారి స్వప్రయోజనాలపై దృష్టి సారించాయి. కాబట్టి ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజల విషయంలో మనకు ప్రత్యేక వ్యూహం ఉంది. ఈ విషయాన్ని మోదీ మాత్రమే కాదు దేశ ప్రజలంతా ప్రపంచానికి చాటిచెప్పాలి” అని తెలిపారు. 
 
దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు తమ స్వార్థాన్ని వీడి దేశ ప్రయోజనాల కోసం ప్రజల్లో ఐక్యతా భావనను కలిగించాలని మోదీ సూచించారు. మనమంతా స్వదేశీ సంకల్పాన్ని తీసుకోవాలని, మనం ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని తయారీ వెనుక భారతీయుల కష్టం ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

కాగా, రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద 20వ విడత నిధులను శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’  కింద రైతులకు పెట్టుబడి సాయం నిధులను విడుదల చేశారు. మొత్తం రూ. 20,500 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. దీని ద్వారా మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.