రాహుల్ ఓటర్ల చౌర్యం ఆరోపణలను తిరస్కరించిన ఈసీ

రాహుల్ ఓటర్ల చౌర్యం ఆరోపణలను తిరస్కరించిన ఈసీ
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విస్తృతంగా చేస్తున్న ఓటర్లను చౌర్యం  చేశారనే తీవ్రమైన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా తిరస్కరించింది. వాటిని “నిరాధారమైన”, “బాధ్యతారహితమైనవ” ఆరోపణలని స్పష్టం చేసింది.  గాంధీ ప్రకటనలకు ప్రతిస్పందిస్తూ, కమిషన్, “ప్రతిరోజూ వచ్చే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలను ఎన్నికల సంఘం విస్మరిస్తుంది” అని తేల్చి చెప్పింది.
 
బాధ్యతా రహితమైన, నిరాధారమైన ప్రకటలను పట్టించుకోవద్దని.. పారదర్శకంగా తమ విధులను కొనసాగించాలని ఈసీ అధికారులను కోరింది. ప్రస్తుతం ఇలాంటి ఆరోపణలు ప్రతిరోజూ వస్తున్నాయని, వాటికి బలమైన ఆధారాలు లేవని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆయా ఆరోపణల ప్రభావం పడకుండా నిజాయితీగా ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచించింది.
 
పారదర్శకంగా, విశ్వసనీయ ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఓట్ల చౌర్యం దోహదపడటంలో ఈసీఐ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గతంలో ఆరోపించారు. ఇటీవల బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఉటంకిస్తూ, కమిషన్ చర్యలు పాలక పక్షం  బిజెపికి అనుకూలంగా రూపొందించారని ఆయన ఆరోపించారు. 

ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ దేశంలో ఓట్ల చౌర్యం జరుగుతుందని ఆరోపిస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందని ప్రకటిస్తున్న ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈ ప్రకటన విడుదల చేసింది. జులై 23న రాహుల్‌ గాంధీ భారత్‌ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరుగుతోందని ఆరోపించారు. 

 
కర్నాటకలోని ఓ లోక్‌సభ స్థానాన్ని తమ పార్టీ లోతుగా అధ్యయనం చేసి  ఓట్ల చౌర్యం ప్రక్రియను గుర్తించినట్లు తెలిపారు. కర్నాటకలో ఓ లోక్‌సభ స్థానాన్ని ఎంచుకొని జాబితాను డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చామని, ఈ ప్రక్రియను నిర్వహించేందుకు ఆరు నెలల సమయం పట్టిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓట్ల చౌర్యం ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? కొత్త ఓటర్లను ఎక్కడి నుంచి తీసుకువస్తారనే విషయాలను తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. 
 
డాక్యుమెంటరీకి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ ప్రజల ఎదుట, ఈసీ ముందు బహిర్గతం చేస్తామని తెలిపారు. “ఓట్లు దొంగిలించబడుతున్నాయి. ఈ ఓటు దొంగతనంలో ఎన్నికల కమిషన్ భాగస్వామి అని మాకు స్పష్టమైన, తిరస్కరించలేని రుజువు ఉంది. నేను ఈ వాదనను తేలికగా చెప్పడం లేదు. మా వద్ద 100 శాతం ఆధారాలు ఉన్నాయి” అని స్పష్టం చేశారు. “మేము కనుగొన్నది ‘అణు బాంబు’ లాంటిది. ఈ అణు బాంబు పేలినప్పుడు, దేశంలో ఎన్నికల కమిషన్ ఎక్కడా కనిపించదు,” అని గాంధీ ప్రకటించారు.