
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. సంజయ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ముందు లొంగిపోవడానికి సంజయ్‌కు 3 వారాల సమయం ఇచ్చింది. సంజయ్ కస్టడీ కోసం మేజిస్ట్రేట్ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని, అదే విధంగా బెయిల్ కోరుతూ నిందితుడు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
అగ్నిమాపక విభాగం డీజీగా చేసిన సమయంలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ నిర్ధారించినట్లు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు అందజేసింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం తాజాగా గురువారం తీర్పు వెలువరించింది. సంజయ్‌కి ముందస్తు బెయిల్ ఇస్తూ రాష్ట్ర హైకోర్టు 49 పేజీల తీర్పు ఇవ్వడంపైనా గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్ పూర్తి చేసినట్లు ఉందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
నిర్వహించిన ప్రతి సదస్సులో 350 మంది హాజరయ్యారని చూపారని, ఇదెలా సాధ్యమంటూ ప్రశ్నించింది. అన్ని సదస్సుల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ లేకుండా ఎలా ఉంటారని విస్మయం సుప్రీం ధర్మాసనం వ్యక్తం చేసింది. ముఖ్యమైన పదవుల్లో ఉన్న అధికారులు అన్ని చూసుకోవాలి కదా, ఇష్టానుసారం చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్ అప్పగించారు. ఎలాంటి పనులూ జరగకపోయినా ఆ సంస్థకు రూ. 59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు.
సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కోసం క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కు కాంట్రాక్టు ఇచ్చి, 1.19 కోట్ల రూపాయలు చెల్లించారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన పేరిట నిధుల దుర్వినియోగం చేశారని, పనులు జరగకుండానే చెల్లింపులపై ఆధారాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఒక ప్రైవేటు సంస్థతో కలిసి సంజయ్ దుర్వినియోగానికి పాల్పడ్డారని తేల్చింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సమర్పించిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ