తమిళనాడులోని చెన్నై సమీపంలో గతేడాది జరిగిన భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ప్రమాదం కాదని, దానివెనక కుట్ర దాగి ఉన్నదని తేలింది. 2024, అక్టోబర్ 11న రాత్రి 8.30 గంటల సమయంలో చెన్నై సమీపంలోని కవరైపైట్టె రైల్వే స్టేషన్ వద్ద లూప్‌లైన్‌లోకి దూసుకెళ్లిన మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు లూప్‌లైన్‌లోకి దూసుకెళ్లి అక్కడున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపం కాదని, గుర్తు తెలియని వ్యక్తుల విధ్వంసమేనని రైల్వే భద్రతా కమిషనర్ (సిఆర్ఎస్) విచారణలో తేలింది. ఈమేరకు సదరన్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ ఎఎం. చౌదరి తన నివేదికలో రైల్వే బోర్డుకు వివరించారు. కావరాపేట రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాల ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను దుండగులు మార్చారు.
రైలు మెయిన్ లైన్‌లో వెళ్లడానికి బదులుగా లూప్ లైన్‌లోకి ప్రవేశించేలా ట్రాక్‌లోని భాగాలను దురుద్దేశంతో తొలగించారు. దీంతో వేగంగా వస్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగిఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. రైల్వే పరికరాల్లో, ఆటోమేటిక్ సిగ్నలింగ్‌లో ఎలాంటి తప్పిదాలు లేవు. ఉద్దేశపూర్వక మార్పుల వల్లే జరిగిందని నివేదికలో వెల్లడించారు. దీనిని ‘విధ్వంసం’గా అభివర్ణించారు.భాగమతి ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ జీ. సుబ్రహ్మణి అప్రమత్తతోనే పెను ప్రాణ నష్టం తప్పిందని నివేదికలో పేర్కొన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించారని, గూడ్స్ బండిని ఢీకొట్టక ముందే అత్యవసర బ్రేక్‌లు వేయడంతో రైలు వేగం తగ్గిందని, అందుకే ప్రమాద తీవ్రత తగ్గి, ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారని తెలిపారు.
లోకోపైలట్ ప్రయత్నాన్ని రైల్వే మంత్రిత్వశాఖ గుర్తించాలని, ఆయనకు ‘అతి విశిష్ఠ రైల్ సేవా పురస్కారం’ ఇవ్వాలని సిఫార్సు చేశారు. ప్రమాదానికి సంబంధించి రైలు గమనం, రైల్వే సిగ్నల్స్‌పై ‘డాటా లాగర్’ పరికరం విడుదల చేసిన ‘సిమ్యులేషన్ వీడియో’ అప్పట్లోనే బయటకు వచ్చింది. దీనిని పరిశీలించిన రైల్వే అధికారులు, నిపుణులు ఇది 2023 జూన్ 2న నాటి బాలాసోర్ రైలు ప్రమాదాన్ని పోలి ఉందని చెప్పారు.
మెయిన్ లైన్‌లో వెళ్లేందుకే భాగమతి ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అది అనూహ్యంగా లూప్ లైన్‌లోకి వెళ్లి, దానిపై ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిందని రైల్వే బోర్డు తెలిపింది. రైలు ప్రమాదం వెనుక కుట్ర జరిగిందన్న అనుమానాలు వ్యక్తం కాగా, దీనిపై ‘ఎన్‌ఐఏ’ దర్యాప్తు చేపట్టింది. పెద్ద సుత్తి లాంటి పరికరంతో రైల్వే ట్రాక్‌ను దెబ్బ తీసినట్టు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని, దెబ్బతిన్న ట్రాక్ వద్ద బోల్టులు, ఇతర భాగాలు లేకపోవటంపై ఎన్‌ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!