ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక

ప్రభుత్వానికి  కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక
కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. హైదరాబాద్‌లోని బిఆర్‌కెఆర్‌ భవన్‌లో 650 పేజీలతో కూడిన తుది నివేదిక రెండు సీల్డ్‌ కవర్లల్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు చైర్మన్‌ పిసి ఘోష్‌ గురువారం అందజేశారు. ఆయన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె రామకృష్ణారావుకు ఇవ్వడంతో ఈ నివేదికను సిఎస్‌ కార్యాలయంలోని లాకర్‌లో భద్రపరిచినట్టు తెలిసింది. 
 
పిసి ఘోష్‌ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత పలువురు అధికారులు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దలపై చట్ట పరమైన చర్యలుంటాయని తెలిసింది. ఇదిలావుండగా గత బిఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం, మిగతా బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు తలెత్తడంపై విజిలెన్స్‌ విచారణతోపాటు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ)తో అధ్యయనం చేయించింది. లోపాలు తీవ్రంగా ఉన్నట్టు విజిలెన్స్‌ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వెంటనే కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జి అయిన పిసి ఘోష్‌ను నియమిచింది. 2019 నుంచి 2022 వరకు భారతదేశ మొదటి లోక్‌పాల్‌గా ఆయన పనిచేశారు. గత 2024, మార్చి 14న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పిసి ఘోష్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ దాదాపు 15 నెలలపాటు 115 మందిని విచారించింది. 
 
ఈ బ్యారేజీలకు సంబంధించిన డిపిఆర్‌, డిజైన్లను పరిశీలించిన కమిషన్‌, విజిలెన్స్‌ రిపోర్ట్‌ ఆధారంగా నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను విచారణ చేసింది. ఇందులో భాగంగా నాటి ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కూడా కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసింది. 
 
అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఇలా మొత్తం 115 మందిని విచారించి వారి స్టేట్‌మెంట్లను కమిషన్‌ రికార్డు చేసింది. అఫిడవిట్లు, వాంగ్మూలాలను విశ్లేషించి తుది నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి కమిషన్‌ సమర్పించింది. కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి చేరడంతో అందులో ఏముందనే విషయమై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.