పాక్ తో ట్రంప్ కీలకమైన చమురు ఒప్పందం

పాక్ తో ట్రంప్ కీలకమైన చమురు ఒప్పందం

భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌తో కీలకమైన చమురు ఒప్పందాన్ని ఖరారు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్‌లోని అపారమైన చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి అమెరికా, పాకిస్థాన్‌లు కలిసి పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా పాకిస్థాన్, భవిష్యత్తులో భారత్‌కు కూడా చమురు అమ్ముకోవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌లో ఈ ఒప్పందం వివరాలను పంచుకున్నారు. “పాకిస్థాన్ దేశంతో ఒక ఒప్పందం చేసుకున్నాం. పాకిస్థాన్, అమెరికా కలిసి అక్కడి భారీ చమురు వనరులను అభివృద్ధి చేయనున్నాయి. ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నాం. ఎవరు చెప్పగలరు, ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ చమురును అమ్మవచ్చేమో” అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

ట్రంప్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలను విధించారు. ఆ తర్వాత కాసేపటికే పాకిస్థాన్‌తో చమురు ఒప్పందం చేసుకోవడమే కాకుండా, భారత్‌కు వాటి అమ్మకాల ప్రస్తావన రావడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

పాకిస్థాన్‌లో భారీ చమురు నిల్వలు ఉన్నాయనే వాదన కొత్తది కాదు. అయితే వాటిని సమర్థవంతంగా వెలికితీసి, అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకురావడం సవాళ్లతో కూడుకున్నది. ప్రపంచ దేశాలతో వాణిజ్య చర్చలపై కూడా ట్రంప్ స్పందించారు. పలు దేశాల నాయకులతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. అన్ని దేశాలు అమెరికాను సంతోషపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 

దక్షిణ కొరియాతో చర్చలు జరుగుతున్నాయని చెబుతూ ప్రస్తుతం ఆ దేశంపై 25 శాతం టారిఫ్ ఉన్నప్పటికీ, టారిఫ్ తగ్గింపుకు కొరియా ఒక ప్రతిపాదన చేసిందని వివరించారు. ఇతర దేశాల నుంచి కూడా అమెరికాపై టారిఫ్ తగ్గింపునకు ఆఫర్లు వస్తున్నాయని పేర్కొంటూ ఇవి తమ వాణిజ్య లోటును గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.