
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఆగస్టు ఒకటి నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్ర దేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్టు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
పాకిస్థాన్‌తో యుద్ధం విరమించాలని తమకు ఏ దేశాధినేత చెప్పలేదని ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో ప్రకటించిన మరునాడే ట్రంప్ టారీఫ్‌ల మోత మోగించడం గమనార్హం. భారత్, రష్యాతో వాణిజ్యం చేయడంపై ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి భారత్ చాలా వరకు సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.
రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయని తెలిపారు. ఓ వైపు ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న దాడుల్లో మరణాలను అడ్డుకోవాలని అందరూ చూస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి కొనుగోళ్లు చేస్తోందని చెప్పారు. ఇది ఏ మాత్రం మంచిది కాదన్న ట్రంప్ ఇందువల్లనే అమెరికాలోకి దిగుమతయ్యే భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు చెప్పారు.
“భారత్ మాకు మిత్ర దేశమే. ఈ విషయాన్ని మేము మరువం. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య వ్యాపారం తక్కువ మోతాదులోనే కొనసాగింది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో టారీఫ్‌లు ఎక్కువ. భారత్ అనుసరించే వ్యాపార, వాణిజ్య నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగదు రహిత వాణిజ్యానికి ఇవి పెద్ద అడ్డంకిగా మారాయి” అని ట్రంప్ పేర్కొన్నారు.
“రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున తమ సైన్యానికి అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ఆ దేశపు ఆయుధాలను భారీగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా, ఇండియాదే అగ్రస్థానం. అందుకే భారత్‌పై 25 శాతం టారీఫ్‌తో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి” అని ట్రంప్ వెల్లడించారు.
అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలో వచ్చాక అమెరికా దిగుమతులపై ఇతర దేశాలు విధిస్తున్న టారిఫ్‌లపై దృష్టి పెట్టారు. ఏప్రిల్ 2న అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల మోత మోగించారు. ఆయా దేశాలు అమెరికాపై విధిస్తున్న సుంకాల్లో 50 శాతం విధించారు. భారత్‌పై 26 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ఆ సమయంలో ప్రకటించారు. అనంతరం ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు 90 రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటిదాకా అన్ని దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. అనంతరం ఆ గడువు ముగియడంతో ఆగస్టు 1 వరకు పొడిగించారు.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!