
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇకపై శ్రీవారి భక్తులకు ఏరోజుకారోజు శ్రీవాణి దర్శనమ్ నిర్వహించనుంది. ఆగష్టు 1 నుండి ఆగష్టు 15 వరకు ఈ నూతన విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్ లైన్లో పొంది శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో ఆయన శ్రీవాణి దర్శనాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత విధానం వలన సదరు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల సమయం పట్టేది. వారి సౌకర్యార్థమై ఏ రోజు కా రోజు టికెట్ జారీ, దర్శనం కల్పించడం గురించి ప్రయోగాత్మకంగా టీటీడీ అమలు చేయనుంది.
తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన టికెట్ల జారీ చేస్తారు. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు రిపోర్టింగ్ సమయం. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్లు కోటా ఉన్నంతవరకు జారీ చేస్తారు.
యథావిధిగా తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేస్తారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబర్ 31వ తేది వరకు ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతి ఇస్తారు.
నవంబర్ 1వ తేది నుండి శ్రీవాణి టికెట్లను ఆఫ్ లైన్, ఆన్ లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకుని తాము ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేయు ప్రదేశం వద్దకు చేరుకోవాలని మనవి. ఈ నూతన విధానం తో భక్తులు శీఘ్రంగా అనగా వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ