
ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో అంతర్గత విచారణ ప్యానెల్ చేసిన సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొనడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యంగ విరుద్ధమని భావిస్తే విచారణకు ఎందుకు హాజరయ్యారని, దీనిపై ముందే సవాల్ చేయాల్సిందని పేర్కొంది. జస్టిస్ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ వర్మ తరఫు వాదించిన న్యాయవాది కపిల్ సిబల్, న్యాయమూర్తిని తొలగించాలని అంతర్గత విచారణ ప్యానెల్ చేసిన సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.
ఆయన తొలగింపు ప్రక్రియ విధానం ప్రమాదకర ఉదాహరణగా నిలిచిపోతుందని చెప్పారు. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయపరమైన తప్పులు జరిగినప్పుడు దానిపై చర్య తీసుకునే హక్కు భారత ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని జస్టిస్ దత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై ముందుకు సాగాలా? వద్దా? అనేది రాజకీయ నిర్ణయమని, కానీ న్యాయవ్యవస్థ ప్రక్రియను అనుసరించిందని సమాజానికి సందేశం పంపాలని పేర్కొంది. ఈ పిటిషన్‌కు సంబంధించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అంతకుముందు సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, పలు ప్రశ్నలు సంధించింది.
విచారణ పూర్తయి నివేదిక విడుదలయ్యే వరకు జస్టిస్ వర్మ ఎందుకు వేచి ఉన్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కమిటీ నియామకం జరిగినపుడు సుప్రీంకోర్టుకు ఎందుకు రాలేదని, అలాగే విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారని కూడా అడిగింది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన వీడియోను తొలగించాలని ఆశ్రయించారా? అంటూ వర్మ తరఫున న్యాయవాది కపిల్ సిబల్ ను బెంచ్ నిలదీసింది.
More Stories
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్
శబరిమల ఆలయం బంగారు మాయంపై క్రిమినల్ కేసు