
భారత్, అమెరికా కలిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నిసార్’ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. బుధవారం సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 2,392 కిలోల బరువున్న ‘నిసార్’ ఉపగ్రహాన్ని మోసుకుని ‘జివిఎస్ఎల్-ఎఫ్16’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి మోసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నిసార్ ఉపగ్రహాన్ని 740 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి చేర్చింది.
ఈ ప్రయోగం కోసం ఇస్రో, నాసా కలిసి మొత్తం 1.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేశాయి. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ద్వారా భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అదేవిధంగా సహజ విపత్తులను, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో నిసార్ ఉపగ్రహం కీలకపాత్ర పోషించనుంది.నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) అనేది ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు అని ఇస్రో, నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (నాసా ఎల్-బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్) ను ఉపయోగించి భూమిని మొదటిసారిగా పరిశీలించనుందని తెలిపారు. ఉపగ్రహం అంతరిక్షం నుంచి భూమిపై ఒక సెంటీమీటరు కంటే తక్కువ వైశాల్యాన్ని కూడా హైరిజల్యూషన్లో చిత్రాలు తీయగలదు. ఇది రోజుకు 14 సార్లు భూమిని చుట్టుముడుతుంది. ఇది భూ ఉపరితంపై ప్రతి కదలిక లేదా మార్పును ప్రతి 12 రోజులకు రెండుసార్లు స్కాన్ చేస్తుంది. అందుకోసం మొదటిసారిగా స్వీప్‌సార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఈ మిషన్ ద్వారా భూ ఉపరితల మార్పులకు కారణాలను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సంయుక్త భూ పరిశోధన మిషన్ కోసం ఈ ‘నిసార్’ అంటే నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ను భారత్, అమెరికా కలిసి అభివృద్ధి చేశాయి. ఈ రెండు దేశాల అంతరిక్ష సంస్థలు నాసా, ఇస్రో పేరు కలిసివచ్చేలా ఈ వ్యవస్థకు ఆ పేరు పెట్టారు. ఈ మిషన్ బడ్జెట్ దాదాపు రూ.12,500 కోట్లు కావడం గమనార్హం.
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయెల్- ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. అంటే ఈ శాటిలైట్ డ్యూయెల్ రాడార్ సిస్టమ్ను కలిగి ఉంది. దీనిలో నాసా ఎల్ -బ్యాండ్, ఇస్రో ఎస్-బ్యాండ్ కలిసి పనిచేసి సమాచారాన్ని అందిస్తాయి. ఇది ఆధునిక రాడార్ ఇమేజింగ్ ద్వారా అంతరిక్షం నుంచి భూ ఉపరితలాన్ని చాలా స్పష్టంగా చూడగలదు.
సింపుల్గా చెప్పాలంటే ఈ శాటిలైట్ ఎక్కడో ఆకాశం నుంచి సెంటీమీటర్ స్థాయిలో భూమిపై కదలికలను పసిగట్టి దానిని 3డిరూపంలో చూపిస్తుంది. ఈ శాటిలైట్ ప్రత్యేకత దాని అధునాతన సాంకేతికత మాత్రమే కాదు. ఇది వ్యవసాయం, వరద ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు అలాగే వాతావరణ మార్పుల గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అంతరిక్షం నుంచి భూమిపై ఉన్న ప్రజలతో పంచుకుంటుంది.
‘నిసార్’ శాటిలైన్ నుంచి పొందిన డేటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలకు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా లభించిన డేటాను ఎవరూ సులభంగా దొంగిలించలేని విధంగా నాసా దాన్ని క్లౌడ్‌లో స్టోర్ చేస్తుంది. నాసా ఎర్త్ సైన్స్ డైరెక్టర్ కరెన్ సెయింట్ జర్మైన్ మాట్లాడుతూ – “భూమిపై ఒక సెంటీమీటర్ మార్పును కూడా గుర్తించే సాంకేతికత నిసార్ వద్ద ఉంది. ఇది అమెరికా-భారతదేశం భాగస్వామ్యంలో ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యంత శక్తివంతమైన భూమి పరిశీలన ఉపగ్రహం” అని పేర్కొన్నారు.
ఈ శాటిలైట్ సూర్య-సమకాలిక కక్ష్య(ఎస్ఎస్ఓ) నుంచి అడవులు, మైదానాలు, కొండచరియలు, పంటలు, పర్వతాలు, మంచు ప్రాంతాల ప్రతి కదలిక లేదా మార్పును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. తద్వారా ఇది భూమిపై జరిగే మార్పులను గమనించడానికి, విపత్తులను అంచనా వేయడంలో శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో, అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యం.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము