రష్యా పసిఫిక్ తీరంలో భయంకరమైన భూకంపం

రష్యా పసిఫిక్ తీరంలో భయంకరమైన భూకంపం
ర‌ష్యాలో ప‌సిఫిక్ తీరంలో ఉన్న కామ్‌చ‌ట్కా ద్వీపంలో అత్యంత శ‌క్తివంత‌మైన భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్ర‌త 8.8గా న‌మోదు అయ్యింది.  భూగ‌ర్భ శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌కారం. భూకంపాల చ‌రిత్ర‌లో ఇది ఆర‌వ అత్యంత శ‌క్తివంత‌మైన భూకంపంగా రికార్డు అయ్యింది. భూగోళాన్ని కుదిపేసిన అతి తీవ్ర‌మైన ప‌ది భూకంపాల్లో తాజా భూకంపం నిలుస్తుంద‌ని హ‌వాయి వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ హెలిన్ జానిస్‌జెవిస్కీ తెలిపారు.
 
రష్యాలో వచ్చిన భారీ భూకంపం కారణంగా పలు దేశాలను సునామీ అతలాకుతలం చేస్తోంది. రష్యా తూర్పు తీరంలోని కంచాట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌లో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రాకాసి అలలు ఇప్పటికే రష్యాతో పాటు జపాన్‌, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను తాకింది. ఇంకా పలు దేశాలు, దీవులకు సునామీ తాకే అవకాశం ఉంది. 
 
ఈ నేపథ్యంలో అధికారులు పసిఫిక్ తీరం అంతటా సునామీ హెచ్చరికలు చేశారు. ముఖ్యంగా అలస్కా, హవాయిల్లో 10 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు, అలాగే యూఎస్​ పశ్చిమ తీరానికి సునామీ ముప్పు పొంది ఉందని పేర్కొన్నారు.
 
దీనితో తీరంలోని విమానాశ్రయాలను, హార్బర్​లను మూసివేశారు. ఫ్లైట్స్​ను క్యాన్సిల్ చేశారు. అంతేకాదు అమెరికా వాతావరణ విభాగం కూడా కీలక హెచ్చరిక జారీ చేసింది. సునామి తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫొటోల కోసం తీరానికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పలుమార్లు వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని పేర్కొంది.
 
సునామీ ముప్పు పొంచి ఉన్న దేశాలు, దీవుల జాబితాను అమెరికా సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌ విడుదల చేసింది. సునామీ ప్రభావాన్ని బట్టి నాలుగు కేటగిరీలుగా ఆ జాబితాను ప్రకటించింది.  ర‌ష్యాలోని కామ్‌చ‌ట్కా ద్వీప‌క‌ల్పంలో వ‌చ్చిన భూకంపంతో ప‌సిఫిక్ తీరాల్లో సునామీ హెచ్చరిక‌లు జారీ చేశారు. జ‌పాన్‌తో పాటు అమెరికాలోనూ హెచ్చరిక‌లు ఇచ్చారు. 
 
దీంతో హ‌వాయి ద్వీపంలో అప్రమ‌త్తత ప్రక‌టించారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అమెరికాలోని పసిఫిక్‌ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.
 
ఇదే స్థాయిలో గ‌తంలో 2010లో చిలీ దేశంలో, 1906లో ఈక్వెడార్‌లో భూకంపం న‌మోదు అయిన‌ట్లు చెప్పారు.  చిలీ భూకంపం క్విరిహు ప‌ట్ట‌ణంలో సంభ‌వించింది. అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే ప్ర‌కారం ఆ భూకంపం వ‌ల్ల సుమారు 523 మంది మ‌ర‌ణించారు. మూడున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. ఇక ఈక్వెడార్‌లో వ‌చ్చిన భూకంపం వ‌ల్ల అత్యంత బ‌ల‌మైన సునామీ వ‌చ్చింది.ఆ సునామీ వ‌ల్ల సుమారు 1500 మంది మ‌ర‌ణించారు. శాన్ ఫ్రాన్సిస్‌కో వ‌ర‌కు ఆ సునామీ అల‌లు చేరుకున్నాయి.గ‌తంలో ర‌ష్యాలోని కామ్‌చ‌ట్కాలోనే అయిదో శ‌క్తివంత‌మైన భూకంపం రికార్డు అయ్యింది. 1952లో ఆ భూకంపం వ‌చ్చింది. భూకంప తీవ్ర‌త 9గా తొలిసారి రికార్డు అయ్యింది. ఆ స‌మ‌యంలో భారీ సునామీ వ‌చ్చింది. అమెరికాలోని హ‌వాయి తీరాన్ని అది తాకింది. దాని వ‌ల్ల దాదాపు ల‌క్ష మిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం జ‌రిగింది. కామ్‌చ‌ట్కా భూకంపం వ‌ల్ల జ‌పాన్‌, అమెరికా తీరాల్లో సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.