ఆగష్టు 12, 13 తేదీల్లో సుప్రీం బీహార్ ఎస్‌ఐఆర్‌ కేసు విచారణ

ఆగష్టు 12, 13 తేదీల్లో సుప్రీం బీహార్ ఎస్‌ఐఆర్‌ కేసు విచారణ
బీహార్‌ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కేసు విచారణ ఆగస్ట్‌ 12,13 తేదీల్లో ఉంటుందని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. 65 లక్షల మందిని ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించారని, వారు మరణించారు లేదా శాశ్వతంగా వేరే చోటుకి తరలించబడ్డారని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) పేర్కొందని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
రాజ్యాంగ సంస్థగా హోదాకు అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా ఇసిఐ చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు మరింత జాగ్రత్తగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చింది.  కాగా, ఓటర్ల జాబితాను స్పెషల్ ఇంటెన్సివ్‌ రిజవిజన్‌ పేరుతో సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉన్నదని, ఈసీ చట్ట ప్రకారం పని చేస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
 
అయితే ఈ సవరణ లక్ష్యం భారీగా కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడమే ఉండాలిగానీ, భారీగా ఓటర్లను జాబితా నుంచి తొలగించడం ఉండకూడదని వ్యాఖ్యానించింది. భారీగా ఓట్లు తొలగింపునకు గురైతే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ బాగ్చిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. 
 
ఆగస్టు 1న ఎన్నికల కమిషన్‌ సవరించిన ఓటర్ల జాబితాను ప్రచురించనుందని, పాత జాబితాలో ఉన్న అనేక మంది ఓటర్లను ఈ జాబితా నుంచి తొలగించారని, దాంతో వారంతా తమ ఓటు హక్కును కోల్పోనున్నారని పిటిషనర్‌లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. దానిపై కోర్టు స్పందిస్తూ సవరించిన ఓటరు జాబితాలో ఏవైనా తప్పులను గుర్తిస్తే ఆధారాలతో సహా తమ దృష్టికి తీసుకురావాలని పిటిషనర్‌లకు సూచించింది. 
 
మీరు భయపడుతున్నట్లుగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపు జరిగితే వెంటనే తాము జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చింది. జాబితాలో అవకతవకలు ఉంటే ఆగస్టు 8లోగా పిటిషనర్‌లు తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ధర్మాసనం సూచించింది. అదేవిధంగా వెరిఫికేషన్‌ డాక్యుమెంట్ల లిస్టులో ఆధార్‌కార్డుకు, ఓటర్‌ ఐడీకి చోటు కల్పించాలని ఈసీని ఆదేశించింది.
 
కాగా, ఇక ఎస్‌ఐఆర్‌ను మణిపూర్‌లో నిర్వహించానికి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎన్‌ఐఆర్‌ కోసం మణిపూర్‌లోని బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బిఎల్‌ఓలకు) శిక్షణా తరగతులను ఈ నెల 25 నుంచి ప్రారంభించారు. రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు  మణిపూర్‌ జాయింట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ రామానంద నోంగ్మెయికాపమ్‌ వెల్లడించారు. 
 
“ఇతర రాష్ట్రాలతో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌కు అనుగుణంగానే ఇక్కడా నిర్వహి స్తున్నాం. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ నిర్వహించాలనే ఇసిఐ ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలోనూ సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు. అయితే మణిపూర్‌లో ఎస్‌ఐఆర్‌కు నిర్థిష్టమైన తేదీలను ఇసిఐ వెల్లడించలేదని చెప్పారు. రాజకీయ పార్టీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 (1-1-2026) ఓటర్ల జాబితా ప్రకారం మణిపూర్‌లో ఎస్‌ఐఆర్‌ను నిర్వహించనున్నారు.