
నెహ్రూ హయాంలోని తప్పిదాలను సరిదిద్దలేమని గతంలో 60 ఏళ్లు పాలించిన వారు చెబుతూ వచ్చారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎద్దేవా చేశారు. అయితే మోదీ ప్రభుత్వం నెహ్రూ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దవచ్చని నిరూపించిందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న చర్యలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
రాజ్యసభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌పై చర్చలో పాల్గొంటూ పాకిస్థాన్‌తో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందం శాంతి కోసం కాదని బుజ్జగింపు రాజకీయాల కోసమని ఆరోపించారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి అనంతరం పాకిస్థాన్ తో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేశామని, ఆ నిలిపివేత ఇంకా కొనసాగుతోందని చెప్పారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడేవరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తేల్చిచెప్పారు. సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్న పాలకులు భారత రైతుల ప్రయోజనాల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన విమర్శించారు. సింధూ జలాల ఒప్పందానికి అవసరమైన మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ ప్రభావాన్ని చూడాలనుకుంటే ఉగ్రవాదుల అంత్యక్రియలు, ధ్వంసమైన పాకిస్థాన్ వైమానిక స్థావరాల వీడియోలను చూడాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి హితవు చెప్పారు. భారత్-పాక్ విషయంలో ఏ దేశమూ మధ్యవర్తిత్వం వహించలేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని పునరుద్ఘాటించారు.
రాహుల్ గాంధీని చైనా గురుగా జైశంకర్ అభివర్ణించారు. చైనా అంబాసిడర్ దగ్గర రాహుల్ ప్రైవేటు ట్యూషన్‌లు చెప్పించుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ఉగ్రవాదం బ్రిక్స్, క్వాడ్, ఎస్సీఓ లాంటి సదస్సుల వరకే మాత్రమే ఉండేదని, మోదీ ప్రభుత్వ చర్యల కారణంగా ఉగ్రవాదం ఇప్పడు ప్రపంచ ఎజెండాగా మారిందని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని సంహిచేది లేదని, దాయాది ఎప్పుడు దాడులు చేసినా ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తామని జైశంకర్ తెలిపారు. పాకిస్థాన్ హద్దులు దాటి పహల్గాం ఉగ్రదాడి చేసిందని చెప్పారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు