
అయితే, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం ఎంతో పరాక్రమం చూపిన మన సైనికులకు మద్దతుగా నిలవకుండా. పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చేలా సందేహాలు వ్యక్తం చేశాయని మండిపడ్డారు. ‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం చెబుతూ సుమారు రెండు గంటల పాటు ప్రసంగించారు.
దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చూసీచూడనట్టు వదిలేసిందని, ఉగ్రవాద నిరోధక చట్టాలను నిర్వీర్యం చేసిందని మోదీ ఆరోపించారు. గాంధీ కుటుంబం ఒత్తిడితో పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడవద్దని కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇక కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, మనీశ్ తివారీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాలకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లిన బృందాల్లోని కొందరు నేతలు పార్లమెంటులో మాట్లాడకుండా కాంగ్రెస్ నిలువరించిందని విమర్శించారు..
పహల్గాం ఉగ్రదాడి అంశంలో పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఆపాలని ఏ ప్రపంచ నేత కూడా భారత్‌ను అడగలేదని మోదీ పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు. తానే భారత్, పాక్ యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తోసిపుచ్చేలా స్పష్టత ఇచ్చారు. మూడు దేశాలు తప్ప మొత్తం ప్రపంచ దేశాలన్నీ భారత్‌కే మద్దతు పలికాయని ఆయన చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో మాట్లాడారని ప్రధాని మోదీ వెల్లడించారు.
“ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ఏ నేత కూడా భారత్‌ను అడగలేదు. ఐక్యరాజ్యసమితిలో కేవలం మూడు దేశాలు మాత్రమే పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడాయి. మిగతా అన్ని ప్రపంచ దేశాల నుంచి భారత్‌కే మద్దతు లభించింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మన దేశ సైనికులకు మద్దతుగా నిలవలేదు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు నన్ను లక్ష్యంగా చేసుకుని గుప్పించిన అవివేకమైన ఆరోపణలు సైన్యం నైతిక విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి’’ అని మోదీ మండిపడ్డారు.
మన సామర్థ్యమేమిటో ప్రపంచానికి తెలిసింది
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ ఆయుధాలు, రక్షణ వ్యవస్థల్లో డొల్లతనం ఏమిటో, భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, క్షిపణుల ప్రతాపం ఏమిటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా కేవలం 22 నిమిషాల్లో పాకిస్థాన్ భూభాగంలో లోపలి ప్రాంతాల్లో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. మరునాడు భారత్‌పై దాడికి పాల్పడితే.. పాకిస్థాన్‌పై క్షిపణుల వర్షం కురిపించాం. భారత్ దాడులతో పాకిస్థాన్‌లోని ఎయిర్‌బే్‌సలు ఎంతగా దెబ్బతిన్నాయంటే ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి” అని ప్రధాని తెలిపారు.
“పాకిస్థాన్‌కు పరిస్థితి ఏమిటో అర్థమైపోయి అణ్వస్త్ర దాడులంటూ బెదిరింపులకు దిగింది. కానీ ఏ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఆపరేషన్ సిందూర్ మొదలు సింధు నది (సింధు జలాల ఒప్పందం) వరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాకిస్థాన్‌కు తెలుసు. ఎలాంటి దాడి చేసినా మరింత భారీ స్థాయిలో ప్రతిదాడి ఉంటుందని అర్థమైంది. అందుకే ఏమీ చేయలేకుండా ఉండిపోయింది’’ అని మోదీ చెప్పారు.
‘చాలా దెబ్బతీశారు. ఇక చాలు (బహుత్ మారా. బస్ కరో)’ అంటూ పాకిస్థాన్ డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) కాళ్లబేరానికి వచ్చారని పేర్కొన్నారు. ‘ఒకవేళ మీరు ఏమైనా చేయదలిస్తే.. ఫలితం చాలా దారుణంగా ఉంటుంది’ అని హెచ్చరించామని తెలిపారు. దేశంలో ఇంతకుముందూ ఉగ్రదాడులు జరిగాయని, ఏం చేసినా తమకేమీ కాదని వాటి సూత్రధారులు ధైర్యంగా ఉండేవారని, కానీ ఇప్పుడు భారత్ వెంటాడుతుందని వారికి అర్థమైందని చెప్పారు.
పహల్గాం ఘటన మన దేశంలో అల్లర్లు రేపేందుకు జరిగిన కుట్ర అని, దాన్ని మన దేశ ఐక్యత విఫలం చేసిందని మోదీ చెప్పారు. ఉగ్రవాదుల ప్రధాన స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామని, అందుకే ఈ పార్లమెంటు సమావేశాలను విజయోత్సవాలని చెబుతున్నానని తెలిపారు. ‘‘నేను భారత్ తరఫున నిలబడి ఉన్నాను. దీన్ని అర్థం చేసుకోలేని వారికి వారి ముఖం చూసుకునేలా అద్దాన్ని చూపడానికి నిలబడ్డాను. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్నవారికి ఊహించలేని రీతిలో బుద్ధిచెబుతామని నేను ముందే చెప్పాను” అని తెలిపారు.
“మన సైనికదళాల సామర్థ్యంపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాం. దీటుగా స్పందించేలా స్వేచ్ఛను ఇచ్చాం. మనవాళ్లు ఇచ్చిన సమాధానం చూసి.. ఉగ్రవాదులు, వారి వెనుకున్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు..’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఉగ్రవాదుల అంతం కోసం తేదీలు చూడాలా?
పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పార్లమెంటు సమావేశాల సమయంలోనే హతం చేయడం ఏమిటంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘అసలు వాళ్లకు ఏమైంది? బాగా నిరాశ చెందినట్టున్నారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఏమయ్యారని వారే అడిగారు. మోదీ ఓడిపోయాడంటూ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మేం ఉగ్రవాదులను హతం చేస్తే ఏడుస్తున్నారు” అంటూ ధ్వజమెత్తారు.
ఉగ్రవాదులను అంతం చేయడానికి తేదీలు చూడాలా? అని ప్రశ్నిస్తూ ఈ తీరును చూసి దేశమంతా నవ్వుతోందని పేర్కొన్నారు. ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకురావడం లేదేమని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని పేర్కొంటూ అసలు దేశ విభజనకు అంగీకరించినదెవరని, కశ్మీర్‌ను ఆక్రమించుకునే అవకాశం ఎవరిచ్చారని మోదీ ప్రశ్నించారు. పాక్‌తో సింధూ నది ఒప్పందం ఎవరు చేసుకున్నారని నిలదీశారు. నది మనది, నీళ్లు పాకిస్థాన్‌కు అనేలా చేశారని చెబుతూ నాటి తప్పులకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సింధు ఒప్పందం నిలిపివేత వంటి చర్యలతో వాటిని సరిదిద్దుతున్నామని గుర్తుచేశారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు