భారత్‌లో జన్మించి బ్రిటన్‌లో స్థిరపడ్డ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, రచయిత మేఘనాథ్ దేశాయ్ (84) కన్నుమూశారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా కొనసాగిన లార్డ్ దేశాయ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం విద్యావేత్తలు, రాజకీయ నాయకుల్లో తీవ్ర విషాదం నింపింది.
మేఘనాథ్ దేశాయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆయనను గొప్ప మేధావిగా, ప్రేరణాత్మక వ్యక్తిగా కొనియాడారు. విద్యారంగంలో, ఆర్థిక సంస్కరణల్లో ఆయన కృషి అపారమని మోదీ పేర్కొన్నారు.2009లో భారత ప్రభుత్వం మేఘనాథ్ దేశాయ్‌కు పద్మభూషణ్ అవార్డు అందించింది. ఆయన చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. 1940లో గుజరాత్‌లోని వడోదరలో జన్మించారు.
1963లో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. రెండేళ్ల తరువాత లండన్ వెళ్లి, అక్కడే శాశ్వతంగా స్థిరపడ్డారు.మేఘనాథ్ దేశాయ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో దాదాపు 40 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనేక తరాల విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. ఎల్ఎస్ఈ ఆయనను మేధో దిగ్గజంగా స్మరించింది. అక్కడ 1992లో, ఆయనసెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్‌ను స్థాపించారు. ఎల్ఎస్ఈ డెవలప్‌మెంట్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్, మరియు వ్యవస్థాపక సభ్యుడు కూడా.
ఆర్థిక శాస్త్రం, మార్క్సిజం, భారతీయ రాజకీయాలపై ఆయన రాసిన పుస్తకాలు ప్రశంసలు పొందాయి. 1991లో లేబర్ పార్టీ తరపున హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో సభ్యుడయ్యారు. తరువాత క్రాస్‌బెంచ్ సభ్యుడిగా కొనసాగారు.‘మార్క్స్ రివెంజ్’, ‘ది రీడిస్కవరీ ఆఫ్ ఇండియా’ ఆయన ప్రధాన రచనలు. 2022లో ‘పాలిటికల్ ఎకనమీ ఆఫ్ పావర్టీ’ పేరుతో చివరి పుస్తకం రాశారు. బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌పై కూడా ఒక పుస్తకం రచించారు.
జీవితంలో ఎక్కువ భాగం లండన్‌లో గడిపినా, భారతదేశంతో సంబంధాలు కొనసాగించారు. ఆర్థిక, రాజకీయ చర్చల్లో తరచూ పాల్గొన్నారు.ఆయన మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా నేతలు, విద్యావేత్తలు సంతాపం తెలిపారు. అనేక సంస్థలు ఆయనను మేధో దిగ్గజంగా కీర్తించాయి. మేఘనాథ్ దేశాయ్ మృతి ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాలకు పెద్ద నష్టం. ఆయన కృషి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుంది.
More Stories
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ మళ్ళీ మొదలు కావచ్చు
భారత్ చేతిలో మరోసారి చిత్తుగా ఓడిన పాక్