శంషాబాద్‌ లో మద్యం కుంభకోణం నగదు డంప్‌

శంషాబాద్‌ లో మద్యం కుంభకోణం నగదు డంప్‌
ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసులో దూకుడుకుగా సోదాలు జరుపుతున్న సిట్‌ అధికారులు తాజాగా రంగారెడ్డి జిల్లా కాచారంలో జరిగిన సోదాలు కేసుకు కీలక మలుపు తిప్పాయి. కాచారంలోని సులోచన ఫామ్‌హౌస్‌పై సిట్‌ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో ఏకంగా రూ.11 కోట్ల నగదు బయటపడింది. ఈ డబ్బును 12 బాక్సుల్లో దాచినట్టు గుర్తించారు.
 
ఎ40 వరుణ్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి. ఏ1 రాజ్‌ కేసిరెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నగదు దాచినట్టు వరుణ్‌, చాణక్య అంగీకరించినట్లు తెలుస్తోంది. 2024 జూన్‌లోనే ఈ నగదు ఫామ్‌హౌస్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. అంతకు ముందు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్‌లో వరుణ్ కీలక వ్యక్తిగా గుర్తించారు. 
ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అధికారులు చేసిన విచారణలో ఈ ఫామ్‌హౌస్‌ ప్రొఫెసర్ తగల బాల్‌రెడ్డి పేరు మీద ఉన్నట్టు బయటపడింది. ఈ విషయంతో కేసులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సిట్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌లో కీలక సోదాలు నిర్వహించారు.

ఏ1 కేసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో సోదాలు జరిగాయి. అలాగే అరెస్టైన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్‌ను అధికారులు పూర్తిగా పరిశీలించారు. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారో అన్వేషిస్తున్నారు.అధికారులు భారతి సిమెంట్స్‌లో ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసులోని పలు ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో భారతి సిమెంట్స్‌ కీలక కేంద్రంగా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నోట్ల కట్టలను ఎప్పటికప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించేలా అట్టపెట్టెల్లో సర్ది ఉంచారు. ఇలా డెన్‌లలో సర్దిపెట్టిన డబ్బు అట్టపెట్టెలనే అంతిమంగా తాడేపల్లిలోని డెన్‌కు తరలించేవారని అనుమానిస్తున్నారు.  వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపంలోని ది ల్యాండ్‌ మార్క్‌ అపార్ట్‌మెంట్‌లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అతని అనుచరులకు ఆ మద్యం ముడుపులు చేరవేసేవారు. అక్కడి నుంచి గతఎన్నికల్లో వైెఎస్సార్సీపీ అభ్యర్థులకు ఖర్చుల కింద పంపిణీ చేసినట్లు సిట్‌ గుర్తించింది.

 మద్యం డిస్టిలరీల యజమానులు, వ్యాపార సంస్థల నుంచి నగదు రూపంలో ముడుపులు స్వీకరించడం, దాచుకోవడం, పంపిణీ కోసమే మద్యం మాఫియా డెన్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ముడుపుల మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించాలని ఆయా సంస్థలకు మద్యం మాఫియా షరతు పెట్టేది. అలాంటి కంపెనీలకే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇచ్చేవారు. 

ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ చెల్లింపులు జరపగానే ఆయా సరఫరాల కంపెనీలకు మద్యం మాఫియా తరఫున ప్రకాశ్‌ అనే వ్యక్తి నుంచి ఫోన్‌ వెళ్లేంది. ముందుగా మాట్లాడుకున్న ప్రకారం ముడుపుల సొమ్మును నిర్దేశిత ప్రాంతాల్లోని వ్యక్తులకు అప్పగించాలని సూచించేవారు.