బీహార్ ఓటర్ల జాబితా సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ

బీహార్ ఓటర్ల జాబితా సవరణపై స్టేకు సుప్రీం నిరాకరణ
బీహార్‌లో ‘సర్‌’ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై   స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. జులై 29న తుది విచారణ చేపడతామని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.  ముసాయిదా జాబితా ప్రచురణపై మధ్యంతర స్టే ఇవ్వాలని పిటిషనర్లలో ఒకటైన స్వచ్చంద సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్‌ నారాయణన్ కోరారు.
మధ్యంతర ఉపశమనం కోసం పట్టుబట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేసింది. ప్రస్తుతం స్టే ఇవ్వలేమని ఒకేసారి తేల్చుతామని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఆధార్, ఓటర్‌ కార్డులను అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఓటర్, ఆధార్, రేషన్ కార్డులను అనుమతిస్తామని తన కౌంటర్ అఫిడవిట్‌లో ఎన్నికల సంఘం అంగీకరించినట్లు ధర్మాసనం గుర్తుచేసింది.
రేషన్ కార్డులను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశం ఉందన్న ధర్మాసనం, ఆధార్, ఓటర్‌ కార్డులకు కొంత పవిత్రత, యదార్థత ఉన్నట్లు పేర్కొంది. ఎస్‌ఐఆర్‌లో గుర్తింపు కార్డులుగా ఆధార్‌, ఓటర్‌ కార్డులను ఆమోదించాలని సుప్రీం కోర్టు మరోసారి ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేసింది. ఎన్నికలు జరగనున్న బీహార్‌లో చేపట్టిన ఈ ప్రక్రియ, పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చుకునేలా వుండాలి కానీ పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేలా వుండకూడదని కోర్టు తేల్చి చెప్పింది.

ఆధార్‌, ఓటర్‌, రేషన్‌ కార్డులను సులభంగా ఫోర్జరీ చేయవచ్చన్న ఎన్నికల కమిషన్ వాదనపై సుప్రీం తీవ్రంగా స్పందిస్తూ, ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్‌నైనా ఫోర్జరీ చేయవచ్చని వ్యాఖ్యానించింది. వంద ఓటర్ల కార్డుల్లో బహుశా ఏ ఒక్కటో నిజమైన కార్డు కాకపోవచ్చని పేర్కొంది. అటువంటి విషయాలను ఏ కేసుకు ఆ కేసుగానే చూడాలి తప్ప అన్నింటికీ వర్తించలేమని స్పష్టం చేసింది.

మరోవైపు, బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇండియా బ్లాక్ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. అందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో సహా ఇండియా బ్లాక్ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యంపై దాడి’ అంటూ రాసి ఉన్న బ్యానర్ పట్టుకుని నినాదాలు చేశారు.