రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట 
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట వేస్తామని రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు హామీ ఇచ్చారు. బిజెపి ఓబిసి మోర్చా సమావేశంలో మాట్లాడుతూ మతపరమైన కోణంలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలన్న కాంగ్రెస్ చేస్తున్న కుట్రను బిజెపి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేస్తూ ఓబీసీలకు అన్యాయం జరగకుండా, వారి హక్కులను కాపాడేందుకు బిజెపి ముందుంటుందని భరోసా ఇచ్చారు.
 
గత జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా బీసీలకు 50 డివిజన్లు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించగా వాటిలో సుమారు 35 డివిజన్లలో బీసీల స్థానంలో ముస్లింలే గెలిచారని ఆయన గుర్తు చేశారు. ఈ పరిణామంతో గౌడ్, యాదవ, గంగపుత్ర వంటి బీసీ సామాజిక వర్గాలకు అసలు న్యాయం జరగలేదని తెలిపారు. గత ప్రభుత్వం బీసీలకు కేటాయించిన స్థానాలను మతపరమైన ఓటు బ్యాంకు ప్రయోజనం కోసం వాడుకుందని ధ్వజమెత్తారు. 
 
ఇది బీసీల పట్ల ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి, వారికి చేసిన అన్యాయానికి స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. ప్రస్తుతం ముస్లింలకు 4% రిజర్వేషన్ విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలవుతోందని, అయితే కానీ ముస్లిం మైనారిటీ స్కూళ్లు, మదర్సాలు ప్రభుత్వ నియమాలకు అతీతంగా నడవడం రాజ్యాంగబద్ధంగా సమర్థించదగిన విషయం కాదని స్పష్టం చేశారు. దీనిని ఈబీసీ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, మతపరమైన ప్రాధాన్యత ఇవ్వాలనే కుట్ర జరుగుతోందని ఆయన హెచ్చరించారు.


బీసీ రిజర్వేషన్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఏ మాత్రం ముప్పు లేకుండా, అదనంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని రామచందర్ రావు గుర్తు చేశారు.  
మోదీ ప్రభుత్వం కేబినెట్లో 27% మంది బీసీ మంత్రులు ఉన్నారని ముఖ్యమంత్రులతో కూడా బిసీలకు పెద్దపీట వేసిన ఘనత మోదీ గారిదే అని స్పష్టం చేశారు. బీసీ కమిషన్‌ను తీసుకువచ్చింది కూడా మోదీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన విషయానికొస్తే, అది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ కాదని, ఆ గణన కేవలం గణాంకాల సేకరణ మాత్రమే అని బిజెపి నేత తెలిపారు. ఎందుకంటే, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థల ద్వారా కాకుండా, ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన ప్రక్రియ అని చెప్పారు. కులగణనకు సంబంధించి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బయట పెట్టకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

మండలాల స్థాయిలో కులగణన చేయలేదని అనేకమంది టీచర్లు చెబుతున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వివరాలను బయటపెట్టే ఉద్దేశం కనబడడం లేదని విమర్శించారు. కులగణనను అధికారికంగా చేయాలంటే, అది రాజ్యాంగబద్ధమైన సంస్థలతో, సరైన డేటా ద్వారా చేయాల్సి ఉంటుందని తెలిపారు. బిజెపి కులగణనకు వ్యతిరేకం కాదని, కానీ అది శాస్త్రీయంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలని స్పష్టం చేశారు. 

నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రేపు జరగబోయే జనాభా గణనలో కులగణనను అధికారికంగా తీసుకురాబోతున్నదని చెప్పారు.  అధికారికంగా జనగణనలో భాగంగా కులగణనను చేర్చడం వల్ల దేశంలోని వివిధ సామాజిక వర్గాల గణాంకాలు స్పష్టంగా వెలుగులోకి రానున్నాయని తెలిపారు.