
ఖమ్మం జిల్లాలో బిజెపి మరింత బలపడుతోందని పేర్కొంటూ ఇప్పటి వరకు ఈ జిల్లా కమ్యూనిస్టుల గడ్డగా భావించేవారని, అయితే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా బిజెపి అడ్డాగా మారనుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు భరోసా వ్యక్తం చేశారు. రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన తనకు ఘనస్వాగతం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్ లోనే అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ పార్టీని వదిలి బిజెపిలో చేరారని గుర్తు చేశారు.
ఖమ్మం జిల్లాలో కూడా కమ్యూనిస్టు కార్యకర్తలు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతూ వారికి స్వాగతం పలికారు. కమ్యూనిస్టు సిద్ధాంతం ఇప్పుడు పూర్తిగా విఫలమైందని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా వారు క్షీణించిపోతున్నారని పేర్కొంటూ ఒకటిరెండు చోట్ల మాత్రమే గెలుస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బిజెపి క్రమంగా బలపడుతోందని, అక్కడ బిజెపి సీట్లు గణనీయంగా పెరిగాయని గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను జోడించే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. దీనిని బిజెపి వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేస్తూ ఈ రిజర్వేషన్ల బిల్లుకు బిజెపి భేషరతుగా మద్దతు తెలిపిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ తెచ్చిన బిల్లులో న్యాయపరమైన లొసుగులు ఉన్నాయని ప్రజలకు అర్థమైందనే, దానిని షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని నిందిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని రామచందర్ రావు విమర్శించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చిందని గుర్తించుకోవాలని హితవు చెప్పారు.
అందుకే ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని పేర్కొంటూ అందులో ఒక్కశాతం తగ్గినా బిజెపి ఊరుకోదని హెచ్చరించారు. కాంగ్రెస్ తీసుకొచ్చినది బీసీల రిజర్వేషన్ల బిల్లు కాదని, ముస్లింల రిజర్వేషన్ల బిల్లు అని మండిపడ్డారు.
బిజెపి ముస్లింలకు వ్యతిరేకం కాదని చెబుతూ ఇప్పటికే ఈబీసీ కోటాలో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని బిజెపి నేత గుర్తు చేశారు. అదనంగా తెలంగాణలో మరో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అయితే ఈ అంశం కోర్టులో పరిష్కారం కోసం ఉందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో ఉన్న వివరాలను ఎందుకు ప్రజలకు వివరించడంలేదు? అని ఆయన ప్రశ్నించారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు