పాక్‌ ఓటమిని అంగీకరించి కాళ్లబేరానికి వచ్చింది

పాక్‌ ఓటమిని అంగీకరించి కాళ్లబేరానికి వచ్చింది
 
* ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగిసిపోలేదు
 
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి విరామం ఇచ్చినట్లు చెప్పారు. దాయాది తోకజాడిస్తే గట్టిగా బదులు ఉంటుందని హెచ్చరించారు. లోక్‌సభ లో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చను ప్రారంభిస్తూ త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్‌ తట్టుకోలేకపోయిందని, వెంటనే కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపారు. 
 
పాక్‌ డీజీఎంవో వెంటనే భారత్‌ను సంప్రదించినట్లు చెప్పారు. “మన సైనిక దళం చేసిన ఖచ్చితమైన దాడుల తర్వాత పాక్‌ కాళ్లబేరానికి వచ్చింది. ఓటమిని అంగీకరించింది. యుద్ధాన్ని ఆపాలని ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్‌ను ఆపాం. భవిష్యత్తులో పాకిస్థాన్‌ దాడులకు పాల్పడితే.. గట్టిగా బదులిస్తాం” అని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. పహల్గాం దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినట్లు రక్షణమమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
పాక్ పీచమణిచి కాళ్లబేరానికి వచ్చేట్లు చేశామని పేర్కొంటూ ఆపరేషన్ సిందూర్‌ ద్వారా రాజకీయ, సైనిక లక్ష్యాలు నెరవేరాయని వివరించారు.  యుద్ధం ప్రారంభించడం తమ లక్ష్యంకాదని తేల్చిచెప్పారు. మన దేశానికి చెందిన ఎన్ని విమానాలు కూలాయనే ప్రశ్నల నేపథ్యంలో దేశ భద్రత విషయంలో చిన్న చిన్న విషయాలకు అంత ప్రాధాన్యత ఉండదని స్పష్టంచేశారు.
“మన సైనికుల సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదు. ఆపరేషన్ సిందూర్‌ విజయవంతమైందని గట్టిగా చెబుతున్నా. ఈ ఆపరేషన్​ తర్వాత పాక్ సైన్యం మనపై దాడికి దిగింది. పాక్ దాడులను మనం సమర్థంగా తిప్పికొట్టాం. పాక్​పై మన సైనికులు మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో పాకిస్థాన్‌లోని మిసైల్‌ లాంచింగ్ స్టేషన్ ధ్వంసమైంది” అని చెప్పారు. 

“అనంతరం పాక్‌ మనపై జరిపిన దాడులను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. దాయాది దేశం నుంచి వచ్చిన అన్ని రకాల దాడులను మనం సమర్థంగా అడ్డుకున్నాం” అని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.   పాక్‌ నుంచి వచ్చిన అన్ని దాడులను ఎదుర్కొన్నట్లు చెప్పారు.  మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని చెబుతూ సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని రక్షణమంత్రి మండిపడ్డారు. సైనిక చర్యలపై ప్రశ్నలు వేసేటప్పుడు ఆచితూచి, ఆలోచించి ప్రశ్నించాలని విపక్షాలకు సూచించారు.

“ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైన్యం సత్తాకు నిదర్శనం. భారత సైనికులకు నా సెల్యూట్‌. దేశ ప్రజలను రక్షించడం మా బాధ్యత. పాక్‌ పౌరులకు నష్టం కలగకుండా దాడులు చేశాం. 22 నిమిషాల్లో ఆపరేషన్‌ను పూర్తి చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం” అని రక్షణ మంత్రి తెలిపారు. 

“పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారు. ఆత్మరక్షణమే కోసమే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టాం. ఈ ఆపరేషన్‌తో అద్భుతమైన ఫలితాలను సాధించాం. ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని రక్షణ మంత్రి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు.