డ్రగ్స్‌ కేసులో ఎన్‌సిపి (ఎస్‌పి) నేత అల్లుడి అరెస్ట్

డ్రగ్స్‌ కేసులో ఎన్‌సిపి (ఎస్‌పి) నేత అల్లుడి అరెస్ట్

 డ్రగ్స్‌ కేసులో ఎన్‌సిపి (ఎస్‌పి) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే కుమార్తె రోహిణీ ఖడ్సే భర్త ప్రాంజల్‌ ఖేవాల్కర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం తెల్లవారుజామున పూణెలోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. భారీగా డ్రగ్స్‌, హుక్కా సెటప్స్‌ మరియు మద్యంను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో ఎన్‌సి (ఎస్‌పి) నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే అల్లుడు ప్రాంజల్‌ ఖేవాల్కర్‌ కూడా ఉన్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. వారందరినీ కస్టడీలోకి తీసుకున్నామని, కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం రోహిణీ ఖడ్సే మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.   

రేవ్‌ పార్టీ జరుగుతుందనే సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని పూణె నగరంలోని ఖరాడి ప్రాంతంలో ఉన్న స్టూడియో అపార్ట్‌మెంట్‌లో పోలీసుల క్రైమ్‌ బ్రాంచ్‌ దాడి చేసిందని ఆ అధికారి తెలిపారు. ఈ దాడిపై ఏక్‌నాథ్‌ ఖడ్సే స్పందిస్తూ పోలీసుల అరెస్ట్‌ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందా అన్న అంశంపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ దాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఒక హెచ్చరిక అని శివసేన (యుబిటి) డిప్యూటీ నేత సుష్మా అంధారే పేర్కొన్నారు.