భారత్ `బంగారు పక్షి’ నుండి `బంగారు సింహం’గా మారాలి

భారత్ `బంగారు పక్షి’ నుండి `బంగారు సింహం’గా మారాలి
 
* భారత్ ను అనువాదం చేస్తే గుర్తింపు, గౌరవం కోల్పోతాం.. భగవత్ హెచ్చరిక
 
ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం “బంగారు పక్షి” నుండి “సింహం”గా మారాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. ప్రపంచం శక్తిని అర్థం చేసుకుంటుందని చెబుతూ దేశం శక్తివంతంగా, ఆర్థికంగా శక్తివంతంగా, సాంకేతిక నైపుణ్య పరంగా ఔన్నత్యం కనిపించాలని తెలిపారు.  కొచ్చిలో శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్ ఆదివారం నిర్వహించిన జాతీయ విద్యా సదస్సు ‘జ్ఞాన్ సభ’లో మాట్లాడుతూ  “ప్రపంచం శక్తిని అర్థం చేసుకున్నందున ఇది అవసరం. కాబట్టి భారత్ బలంగా మారాలి. ఆర్థిక దృక్కోణం నుండి కూడా అది సంపన్నంగా మారాలి” అని ఆయన పేర్కొన్నారు.
దేశం ఇతరులను పాలించడానికి బలంగా మారకూడదని, ప్రపంచానికి సహాయం చేయడానికి బలంగా మారాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, `విద్య భారతీయకరణ’ గురించి ప్రస్తావిస్తూ `భారత్’ అనే పదాన్ని అనువాదం చేసే ప్రయత్నం చేయవద్దని హితవు చెప్పారు. ఆ విధంగా చేస్తే ‘భారత్’ అంటే దాని గుర్తింపును, దానితో పాటు ప్రపంచంలో దానికి ఉన్న గౌరవాన్ని కోల్పోతుందని భగవత్ హెచ్చరించారు.  భారతదేశం ‘భారత్’ అయినప్పటికీ, “మనం బహిరంగంగా లేదా వ్యక్తిగత ప్రదేశాలలో దాని గురించి మాట్లాడేటప్పుడు, వ్రాసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు దానిని అలాగే ఉంచాలి” అని భగవత్ సూచించారు.
 
“ఇది భారత్ కాబట్టి” భారత్ గుర్తింపును గౌరవిస్తారని ఆయన తెలిపారు. “భారత్ అనేది సరైన నామవాచకం. దానిని అనువదించకూడదు. ‘భారత్ అంటే భారత్’. అది నిజం. అందుకే, వ్యక్తిగతంగా లేదా బహిరంగంగా మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు, మనం భారత్‌గానే ఉంచాలి,” అని ఆయన తెలిపారు.  విద్యను భారతీయకరణ కావించాలంటే ముందుగా భారత్ గురించి తెలుసుకోవాలని, మన గుర్తింపు పట్ల విశ్వాసం ఏర్పర్చుకోవాలని, భారత్ పట్ల విశ్వాసం ఉంచి భారతీయునిగా జీవించాలని డా. భగవత్ వివరించారు. 
మనం ఆ గుర్తింపును కోల్పోతే మనలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ గౌరవం కోల్పోతామని, గౌరవం కోల్పోతే మనకు భద్రత ఉండదని ఆయన హెచ్చరించారు.  విద్య మన కడుపులు నింపుకోవడం గురించి, మన కుటుంభం సభ్యుల మంచిచెడులు చూసుకోవడం గురించి నేర్పితే, భారతీయ విద్య ఇతరుల కోసం జీవించడాన్ని నేర్పుతుందని ఆయన చెప్పారు.  “మన విద్య ఉద్దేశ్యం, దాని గురించి మన దృక్పథం ప్రత్యేకమైనది. దాని ప్రకారం ఏదైనా విద్య మనకు మాత్రమే కాకుండా, మన కుటుంబానికి, మొత్తం ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది” అని ఆయన తెలిపారు.
 
ఫలితంగా, ‘విక్షిత్ లేదా విశ్వ గురు భారత్’ ఎప్పుడూ యుద్ధానికి కారణం కాదు లేదా ఎవరినీ అణచివేయదు లేదా దోపిడీ చేయదు అని ఆయన స్పష్టం చేశారు. “చాలా మంది రాజులు వచ్చి వెళ్ళారు మనం రాముడిని ఎందుకు గుర్తుంచుకుంటాము? అందరి కోసం జీవించడం, మన అభివృద్ధిని అందరితో అనుసంధానించడం అనే ధర్మం. ఈ ధర్మాన్ని బోధించడం భారతీయ విద్య. స్వార్థాన్ని మాత్రమే బోధించే విద్య భారతీయ విద్య కాదు” అని కూడా డా. భగవత్ తేల్చి చెప్పారు. 
 
“భారతీయతను విద్య వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో మనమందరం భారత్‌గా మారాలి. అప్పుడే విద్య వైపు భారతీయత నిజంగా వస్తుంది” అని ఆయన సూచించారు. ఆధ్యాత్మికత గురించి తెలియని వారు దాని గురించి అసంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తారని ఆయన చెప్పారు. “ఉనికి కోసమే పోరాటం, బలవంతుడిదే మనుగడ, ఓ ఒప్పందం ప్రకారమే మనమంతా కలిసి ఉండగలం” అనే ఆలోచనలు ఇక్కడ లేవని డా. భగవత్ స్పష్టం చేశారు.  మన ఆలోచన విధానంలో, ఒప్పందం ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ప్రపంచం మన బాధ్యత అని పేర్కొంటూ ఎందుకంటే మొత్తం ప్రపంచం మనల్ని చేసింది అని చెప్పారు. ఈ దృక్కోణాన్ని విద్య ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. పరస్పర సంబంధం, ఐక్యత ఈ విధానపు ఖచ్చితమైన స్వరూపం భారత్ అని వివరించారు.
 
అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన భావన ఆర్థికానికి సంబంధించినది మాత్రమే కాదని, ఇది సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినదని, విద్య దానిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కేరళ గవర్నర్ రాజేంద్ర  అర్లేకర్ తెలిపారు.  చాలా సంవత్సరాలుగా మనం వలసవాద ఆలోచనతో ముందుకు సాగుతున్నామని పేర్కొంటూ ఇప్పుడు ఈ విద్యా విధానం భారతదేశ విద్యను వలసరాజ్యాల నుండి తొలగించే మొదటి ప్రయత్నం అని చెప్పారు.
 
మార్పు వస్తుందని చెబుతూ ఈ మార్పులో మనం భాగమా? కాదా? అని మనం ఆలోచించుకోవాలని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే అభివృద్ధి చెందిన భారతదేశం అనే కల కలగానే మిగిలిపోతుందని హెచ్చరించారు.  శిక్షా సంస్కృతి ఉత్తన్ న్యాస్ జాతీయ కార్యదర్శి డాక్టర్ అతుల్ కొఠారి మాట్లాడుతూ భారతదేశాన్ని మళ్ళీ విశ్వ గురుగా మార్చాలంటే, దాని రోడ్ మ్యాప్ విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.  జాతీయ విద్యా విధానం -2020  భారతీయతపై ఆధారపడిన స్వతంత్ర భారతదేశపు మొదటి విధానం అని తెలిపారు.
 
ఏ దేశ విద్యా విధానానికైనా ఆధారం దాని సంస్కృతి, అభివృద్ధి కావాలని చెప్పారు. `కలిసి రండి, కలిసి ఆలోచించండి, కలిసి పనిచేయండి అనే దార్శనికతతో విద్యా సంస్థలను అనుసంధానించడం జ్ఞాన్ సభ లక్ష్యం అని చెప్పారు.  భారత విశ్వవిద్యాలయాల సంఘం ప్రధాన కార్యదర్శి, ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పంకజ్ మిట్టల్, జాతీయ కన్వీనర్ ఏ వినోద్,  కొచ్చిన్ షిప్‌యార్డ్ సభ్యుడు మధు నాయర్, ఏఐసీటీఈ  చైర్మన్ సీతారామన్ తదితరులు కూడా పాల్గొన్నారు.