కాల్పుల విరమణపై చర్చలకు థాయ్‌ -కంబోడియా అంగీకారం

కాల్పుల విరమణపై చర్చలకు థాయ్‌ -కంబోడియా అంగీకారం

థాయ్‌ల్యాండ్‌- కంబోడియా నేతలు కాల్పుల విరమణపై చర్చలకు తక్షణమే అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. థాయిలాండ్‌తో యుద్ధాన్ని ఆపడానికి కంబోడియా ప్రధాని హున్ మానెట్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ తెలిపారు.  ఆ రెండు దేశాల నేతలతో దేశాధినేతలతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు. 

ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ వేదికగా ప్రకటించారు. కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్‌ మానెట్‌, థాయ్‌ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్‌ వెచాయాచాయ్‌లతో మాట్లాడానని, ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. 

వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారని పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాల్పుల విరమణ సహా ఘర్షణ ముగింపు కోసం థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని వెచాయాచాయ్‌తోనూ మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు.

కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్‌లాండ్‌ తాత్కాలిక ప్రధాని ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. థాయిలాండ్- కంబోడియా సరిహద్దులో వరుసగా నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణల వల్ల 33 మంది మరణించారు. లక్షా 50 వేల మంది స్వస్థలాలను వదిలి మరో చోటుకి వెళ్లారు. 

ఐక్య రాజ్య సమితికి చెందిన భద్రతా మండలి శుక్రవారం న్యూయార్క్‌లో రహస్యంగా అత్యవసర సమావేశం నిర్వహించి థాయ్‌-కంబోడియా తాజా ఘర్షణలపై చర్చలు జరిపింది. కాగా, ఘర్షణ పడుతున్న రెండు దేశాలతోపాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఆసియన్‌కి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది. మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని ప్రతిపాదించింది.

తమపై ముందుగా కంబోడియా దాడి చేసినట్లు థాయ్‌లాండ్‌ చేస్తున్న ఆరోపణలపై సమితిలోని కంబోడియా రాయబారి చియా కేవ్‌ స్పందిస్తూ తమ కన్నా మూడు రెట్ల పెద్ద సైన్యం, వైశాల్యం ఉన్న దేశంపై వైమానిక దళమే లేని ఓ చిన్న దేశం ఎలా దాడి చేయగలదని ప్రశ్నించారు. సైనికులు, ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తూ థాయ్‌లాండ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని కంబోడియా సైన్యం ఆరోపించింది. యుద్ధ సన్నద్ధతను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడింది.