బీజేపీలో బిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని కేటీఆర్ రాలేదా?

బీజేపీలో బిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామని కేటీఆర్ రాలేదా?
తెలంగాణలో రిత్విక్ కంపెనీకి రూ.1660 కోట్ల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి తనపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు ఆరోపణలు చేయడం పట్ల అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై తాను కాంట్రాక్ట్ పొందాననేది అ వాస్తవమని స్పష్టం చేశారు. అసలు ఆ కంపెనీకి తనకు సంబంధం లేదని చెప్పారు.

ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెలితో పోరు ఉన్నట్టే తెలంగాణలో కెటిఆర్‌కు కూడా చెల్లెలి పోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చి మూడు నెలల అయిందని, ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా అని కేటీఆర్ ను రమేష్ ప్రశ్నించారు. 

కాగా, నాలుగు నెలల క్రితం ఢిల్లీలో తన ఇంటికి వచ్చిన కెటిఆర్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని రమేష్ హితవు చెప్పారు. మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపిలో బిఆర్‌ఎస్ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారా? లేదా? స్పష్టం చేయాలని సవాల్ చేశారు.  తాను తమ పార్టీ పెద్దలతో చర్చించి, మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని, మీతో తమకు పని లేదని చెప్పడం వల్లే ఇలాంటి ఆరోపణ చేస్తున్నారని రమేష్ ఆరోపించారు. టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజారిటీతో నువ్వు ఎలా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా? అని ప్రశ్నించారు. 

తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని అడిగితే తమ పార్టీకి కమ్మ కులస్థులు అవసరం లేదని, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత తమ పార్టీలో రెడ్లు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని చెప్పలేదా అని నిలదీశారు. ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని మీరు నాతో చెప్పారా లేదా? అని గుర్తు చేసుకోవాలని రమేష్ ప్రశ్నించారు. 

రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి, టిడిపి పొత్తుతో పని చేస్తాయని, అప్పుడు టిఆర్‌ఎస్ పుట్టగతులు ఉండవని తెలిసే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బిజెపి ఎంపీ ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు రూ. 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని తెలిపారు. వాటిని ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వారు ఎంతమంది? ఆంధ్ర వారు ఎంతమందన్నది తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ దమ్ముంటే రండి మీరు చెప్పిన చేయటకు వచ్చి మీడియా సమక్షంలో చర్చిద్దాం అని సవాల్ విసిరారు.

అయితే, సీఎం రమేశ్ – సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలసి వచ్చి, హెచ్సీయూ భూముల 10,000 కోట్ల స్కాం, 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కుంభకోణంపై ఓపెన్ డిబేట్‌కు రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా సవాలు విసిరారు. తెలంగాణ ప్రజల కోసం స్థాపించబడిన బీఆర్ఎస్ పార్టీ, ఎప్పటికీ ఇతర పార్టీల్లో విలీనం కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ అని, కాంగ్రెస్ – బీజేపీ మద్దతుదారులు ప్రతిసారి ఇరకాటంలో పడినప్పుడు బీఆర్ఎస్ విలీన వార్తలు రాస్తూ ప్రజలను దారితప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.