మతమార్పిడి జరగకుండా వివాహం చట్టవిరుద్ధం

మతమార్పిడి జరగకుండా వివాహం చట్టవిరుద్ధం

మతం మారకుండా వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తుల వివాహం చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఆర్యసమాజ్​లో చట్టాన్ని ఉల్లంఘించి మైనర్​కు వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్​ను కిడ్నాప్ చేసి ఆర్యసమాజ్​లో వివాహం చేసుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు చర్యలను రద్దు చేయడానికి నిరాకరించింది. విభిన్న మతాలకు చెందిన మైనర్ జంటకు వివాహ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన రాష్ట్రంలోని ఆర్యసమాజ్ సంస్థలను డీసీపీ స్థాయి అధికారితో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. కంప్లైయన్స్ సర్టిఫికెట్‌ను అడగాలని రాష్ట్ర ప్రభుత్వ హోం కార్యదర్శిని ఆదేశించింది. 

సోను అలియాస్ సహనూర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ వ్యాఖ్యానించారు. మహారాజ్‌గంజ్‌లోని నిచ్లౌల్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పిటిషనర్ కోర్టుకు తెలిపారు.  పోలీసుల చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేసిందని చెప్పారు. ఆర్యసమాజ్​లో తాను వివాహం చేసుకున్నానని, ఇప్పుడు ఆమె మేజర్​ అని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి నివసిస్తున్నామని, కాబట్టి కేసు విచారణను రద్దు చేయాలని కోరారు.

అయితే ప్రభుత్వ తరఫున న్యాయవాది పిటిషనర్ పిటిషన్​ను వ్యతిరేకించారు. పిటిషనర్, అమ్మాయి ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారని కోర్టుకు తెలిపారు. మతం మారకుండా వివాహం చట్టవిరుద్ధమని చెప్పారు. ఆ తర్వాత ఆర్య సమాజ్ సంస్థలు నకిలీ వివాహాలు, మైనర్లకు వివాహ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయని కోర్టు గమనించింది.  దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు బెంచ్ తెలిపింది. దర్యాప్తు నివేదికతో పాటు హోం కార్యదర్శి నుంచి వ్యక్తిగత అఫిడవిట్‌ను కూడా కోరింది.

కొంతకాలం క్రితం, ముస్లింల వివాహంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం వివాహం హిందూ మతంలో జరిగినట్లుగా ధార్మికమైనది కాదని పేర్కొంది. ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు అని, అది రద్దైనప్పటికీ బాధ్యతలు రద్దు కావని వ్యాఖ్యానించింది. బెంగళూరు​కు చెందిన ఎజాజుర్ రెహ్మాన్(52) దాఖలు చేసిన పిటిషన్​పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.