ఇక హమాస్‌ కథ ముగించాల్సిందే

ఇక హమాస్‌ కథ ముగించాల్సిందే

గాజా కాల్పుల విరమణ చర్చలు విఫలమవడానికి కారణం హమాస్ అని పేర్కొంటూ  ఇక హమాస్‌ కథ ముగించాల్సిందేనని స్పష్టం చేస్తూ గాజాలో దాడులు తీవ్రతరం చేయాలంటూ ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇజ్రాయెల్ తన సైనిక చర్యను ఉధృతం చేయడాన్ని ఆయన సమర్ధిస్తూ హమాస్‌కు శాంతి ఒప్పందంపై ఆసక్తి లేదని ఆయన మండిపడ్డారు. 

“హమాస్‌కు శాంతి ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన లేదు. వాళ్లకు చావడమే ధ్యేయంగా కనిపిస్తోంది. అది బాధాకరం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. హమాస్ చావును కోరుకుంటోందని, ఇప్పుడు అది అంతరించాల్సిన సమయం వచ్చిందని, గాజాలో తుదిపనిని ఇజ్రాయెల్ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఒక ఒప్పందం కుదురుతుందని, అది సంఘర్షణను అంతం చేస్తుందని, మిగిలిన బందీలను విడుదల చేస్తుందని, గాజాకు మానవతా సాయానికి అనుమతిస్తుందని కొద్ది వారాల క్రితం ట్రంప్ చాలా నమ్మకంగా చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన మాటల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. 

అంతేకాదు, హమాస్తో చర్చలు జరిపేందుకు దోహా వెళ్లిన మధ్యప్రాచ్య దూత స్టీవ్ విట్‌కాఫ్ నేతృత్వంలోని ప్రతినిధులను అమెరికా ఉపసంహరించుకున్న ఒకరోజు తర్వాత ట్రంప్ ఈ వాఖ్యలు చేయడం గమనార్హం. హమాస్ వద్ద సమన్వయం లోపించిందని, వారు సద్భావనతో వ్యవహరించడం లేదని స్టీవ్ విట్‌కాఫ్ ఆందోళన వ్యక్తం చేశారు.  బందీల విడుదలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. మరోవంక, మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్, కతార్ అధికారులు మాత్రం పరిస్థితిని భిన్నంగా చూస్తున్నాయి. ప్రస్తుతం గాజా యుద్ధవిరామ చర్చలు తాత్కాలికంగా నిలిచిపోవడాన్ని ఒక సాధారణ విషయంగా అభివర్ణించారు. 

ఇటువంటి చర్చల్లో అడ్డంకులు, అవగాహన లోపాలు, రాజీపడలేకపోవడం వంటివి కలుగుతుంటాయని, వాటిని ఎప్పుడూ తుది వైఫల్యంగా పరిగణించలేమని ఆ దేశాలు చెబుతున్నాయి. అలేగా, ఇదే విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి కూడా చెప్పడం గమనార్హం. ‘చర్చలు పూర్తిగా విఫలమైనట్లు చెప్పలేం. దశకు ఇప్పుడే చేరుకోలేదు. చర్చలు కొనసాగే అవకాశాలూ ఉన్నాయి’ అధికారి వెల్లడించారు