
తండ్రిని మార్చిన వ్యవహారంలో సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు, పలు కీలక పత్రాలతోపాటు వీర్యకణాల శాంపిల్స్ తీసుకెళ్లారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
ఓ మహిళ భర్త వీర్యకణాలతో సంతానం కలిగించాలని వైద్యురాలు నమ్రతను ఆశ్రయించగా వేరే వ్యక్తి స్పెర్మ్ ద్వారా గర్భం దాల్చేలా చేశారు. జన్మించిన మగబిడ్డ ఆరోగ్యం క్షీణించింది. పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ అని తేలింది. దీంతో తల్లిదండ్రులు శిశువుకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. శిశువు డీఎన్‌ఏ, భర్త డీఎన్‌ఏతో వేరుగా ఉండటంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విజయవాడ వెళ్లి, దవాఖాన నిర్వాహకురాలు నమ్రతతో పాటు సెంటర్‌లో పని చేస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. 2019లో కూడా ఒక కేసుకు సంబంధించి డాక్టర్ నమ్రత అరెస్టయ్యారు. సరోగసి ద్వారా బిడ్డను అందిస్తామంటూ విశాఖకు చెందిన దంపతుల నుంచి రూ.12.5 లక్షలు తీసుకుని, ముఖం చాటేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దవాఖాన లైసెన్స్‌ను ఐదేండ్లపాటు రద్దు చేసింది. ఆ తర్వాత 2020లో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని దవాఖాన నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శనివారం రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖల అధికారులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 50 మంది స్పెర్మ్‌ను గుర్తించారు. కొంతమంది యువకులకు డబ్బు ఆశ చూపి వీర్యం సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు.
పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వైద్యవ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఏజెంట్లను నియమించుకుని, సరోగసి కోసం పేద మహిళలకు ఎర వేస్తున్నారు. డబ్బు ఆశ చూపి ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భధారణ చేయించి, పసికందులను విక్రయించిన చరిత్ర యూనివర్సల్ సృష్టి సెంటర్‌ది అని వైద్యవర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ, బెంగళూరు, భువనేశ్వర్, కోల్‌కతాలోనూ డాక్టర్ నమ్రత సృష్టి పేరుతోనే ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలు నిర్వహించి, నిరుపేద మహిళలను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి ఈ వ్యవహారం నడుపుతున్నట్టు తెలిసింది. విశాఖలో 2010లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు రావడంతో ఆ దవాఖానను యూనివర్సల్ సృష్టి సెంటర్‌గా మార్చారు.
More Stories
తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి వైపు చూస్తున్న నేపాల్
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం