సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ఆసియా కప్

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ఆసియా కప్

ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్‌ టోర్నీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదం తెలపడంతో మెగా ఈవెంట్‌కు లైన్ క్లియర్ అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ వెల్లడించాడు.

టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ ఎడిషన్‌ను పొట్టి ఫార్మాట్‌లోనే జరపనున్నారు. “ యూఏఈ వేదికగా ఈ ఏడాది పురుషుల ఆసియా కప్ నిర్వహించనున్నామనే విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకూ జరుగుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లు, నాకౌట్ మ్యాచ్‌ల తేదీలతో పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తాం” అని నఖ్వీ వెల్లడించాడు.

షెడ్యూల్ ప్రకారం భారత్‌లో ఈసారి ఆసియా కప్ జరగాల్సింది. పాక్‌తో ఉద్రిక్తతల కారణంగా ఆతిథ్య హక్కులను వదులుకున్న బీసీసీఐ తటస్థ వేదికపై నిర్వహణకు తమకు అభ్యంతరం లేదని ఐసీసీకి, ఏసీసీకి తెలిపింది. దాంతో  యూఏఈ గడ్డపై ఈ మెగా ఈవెంట్‌ను జరిపేందుకు ఏసీసీ సన్నాహకాలు ప్రారంభించింది. ఇంకా నెల రోజుల సమయమే ఉండడంతో షెడ్యూల్ ఖరారు చేయడంలో నిమగ్నమైంది ఏసీసీ.

ఆసియా వరల్డ్ కప్‌గా పేరొందిన ఈ టోర్నీలో ఎనిమిది జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ మండలిలో సభ్య దేశాలైన భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించాయి. పసికూనలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, హాంకాంగ్ జట్లు తొలిసారి ఈ పోటీల బరిలో నిలిచాయి.  కాగా, 2023లో ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టోర్నమెంట్‌ను గెలుచుకున్న టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.