
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను తమ తెగువతో భారత సైనికులు అడ్డుకున్నారు. ఆపరేషన్ విజయ్ పేరుతో కార్గిల్ యుద్ధాన్ని ప్రారంభించి శత్రు సైనికులను తరమికొట్టారు. ఇది జరిగి శనివారంతో 26 ఏండ్లు పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని ద్రాస్‌లో వార్ మెమోరియల్ వద్ద వారి కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులు, స్థానికులతో కలిసి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు. మరోవైపు కార్గిల్ అమర వీరులకు నివాళులర్పిస్తూ భారత వాయుసేన ప్రత్యేక వీడియోను రూపొంచింది. దానిని తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అందులో రాసుకొచ్చింది.
దేశ జవాన్ల అసాధారణ శౌర్యం, దృఢ సంకల్పాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వకంగా నివాళులర్పించారు. “కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, మాతృభూమి కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఈ రోజు మన జవాన్ల అసాధారణ శౌర్యం, ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతీక. దేశం కోసం వారి అంకితభావం, అత్యున్నత త్యాగం ఎప్పటికీ దాని పౌరులకు స్ఫూర్తినిస్తుంది” అని ఆమె ఎక్స్ లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
భారతదేశ సాయుధ దళాల అసమాన ధైర్యాన్ని గుర్తిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. “ఈ సందర్భం దేశ గౌరవాన్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన మన సైనికుల అసమాన ధైర్యం మరియు పరాక్రమాన్ని దేశానికి గుర్తు చేస్తుంది. మాతృభూమి కోసం తమను తాము త్యాగం చేయాలనే వారి స్ఫూర్తి ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుంది” అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా కార్గిల్ అమరవీరులకు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. “మన దేశాన్ని రక్షించడం కోసం అత్యంత కఠినమైన భూభాగాల్లో అసాధారణ ధైర్యం, దృఢ సంకల్పంతో పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పిస్తున్నా. కార్గిల్ యుద్ధంలో వారి త్యాగం, మన సాయుధ దళాల అచంచల సంకల్పానికి నిదర్శనం, వారికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది” అని ట్వీట్ చేశారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా భారత సైనికుల వీరోచిత ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించారు. “కార్గిల్ విజయ్ దివస్ అనేది మన దేశ ధైర్య సైనికులకు మరపురాని గర్వకారణమైన విజయ గాథ. 1999 సంవత్సరంలో, మన సైనికులు, ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా, శత్రువులను మోకాళ్లపై నిలబెట్టారు, అజేయమైన ధైర్యం, పరాక్రమానికి ఒక చెరగని ఉదాహరణను అందించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, మాతృభూమి రక్షణ కోసం అంతిమ త్యాగం చేసిన వారందరికీ నేను నివాళులు అర్పిస్తున్నాను. మీ త్యాగం మరియు అంకితభావానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది” అని షా పేర్కొన్నారు.
కార్గిల్ యుద్ధ వీరులను గౌరవించడానికి భారత వైమానిక దళం (ఐఎఎఫ్) తన అధికారిక సోషల్ మీడియా వేదికలో “#IndiaSalutesKargilHeroes. కార్గిల్ యుద్ధంలో వీర యోధులకు భారత వైమానిక దళం హృదయపూర్వక నివాళులు అర్పిస్తుంది. వారి ధైర్యం, త్యాగం మరియు అచంచల సంకల్పం కృతజ్ఞతతో ఐక్యమైన దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి” అని పేర్కొన్నది.
More Stories
స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి
పైలెట్లను నిందించడం బాధ్యతా రాహిత్యం
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం