బంగ్లాదేశ్ లో తాలిబన్‌ తరహా డ్రెస్ కోడ్

బంగ్లాదేశ్ లో తాలిబన్‌ తరహా డ్రెస్ కోడ్

బంగ్లాదేశ్ బ్యాంక్ మహిళలకు కఠినమైన దుస్తుల నియమావళిని విధించడం, ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలను నిషేధించే కొత్త ఆర్డినెన్స్‌తో పాటు, ఇటీవల జారీ చేసిన ఆదేశం విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. తాలిబాన్ తరహా పాలనకు దారితీస్తుందనే విమర్శలు చెలరేగుతున్నాయి.  తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించడం, అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయడంపై మండిపడుతున్నారు. 

బంగ్లాదేశ్‌ బ్యాంక్‌ మహిళా ఉద్యోగులు కురచ దుస్తులు, స్లీవ్ లెస్‌, లెగ్గింగ్స్ ధరించి రాకుండా ఆదేశాలు జారీ చేసింది. చీరలు, సల్వార్‌ కమీజ్‌ సహా ఒళ్లంతా కప్పి ఉండేలా దుస్తులు ధరించాలని ఆదేశించింది. మహిళలు హెడ్‌స్కార్ఫ్, హిజాబ్ ధరించాలని, ఫార్మల్ షూస్, శాండల్స్ ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.  అదే సమయంలో పురుష ఉద్యోగులు జీన్స్, చినో ట్రౌజర్స్ ధరించకుండా బ్యాన్‌ విధించింది. డ్రెస్‌కోడ్‌ పాటించకుండా ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్‌ టీమ్‌ హెచ్చరించింది. ఈ ఆంక్షలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పౌరులు, జర్నలిస్టులు సోషల్ వేదికగా తాత్కాలిక ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 

నియంత పాలనగా పలువురు విమర్శించగా, మరికొందరు ఆఫ్ఘన్‌లోని తాలిబన్‌ పాలనత పోల్చారు. మరికొందరు మహ్మద్‌ యూనప్‌ పాలన కొత్త తాలిబాన్‌ యుగం అంటూ ఓ యూజర్‌ విమర్శించారు. పెద్ద ఎత్తున విమర్శల నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.  గత నెలలో ఒక ఇస్లామిక్ సంస్థ ఒక విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించి.. వారిని హిజాబ్‌ వ్యతిరేకులుగా ముద్రవేసింది. మరో ఇస్లామిక్ సంస్థ జమాత్-చార్ మోనై, బంగ్లాదేశ్‌ను ఆఫ్ఘనిస్తాన్ లాగా షరియా అనుకూల దేశంగా మార్చాలని పిలుపునిచ్చింది.

మే నెలలో హెఫాజత్-ఎ-ఇస్లాం అనే సంస్థకు చెందిన వేలాది మంది కార్యకర్తలు ‘మహిళలు పాశ్చాత్య చట్టాలు వద్దని చెప్పండి’ అంటూ రాసిన బ్యానర్లను పట్టుకు ఢాకా విశ్వవిద్యాలయం సమీపంలో ర్యాలీ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్‌పై సైతం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

చట్టానికి నిరసనగా ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్డినెన్స్‌ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వును ఉల్లంఘించినా అమలును అడ్డుకున్నా వారిని సర్వీస్‌ నుంచి తొలగించవచ్చు లేదంటే స్థాయిని తగ్గించొచ్చని చట్టం చెబుతున్నది. కొత్త చట్టంలో ఉద్యోగిపై తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌ చేసే నిబంధనలు కూడా లేకపోవడం గమనార్హం.

తీవ్ర విమర్శలు ఎదురు కావడంతో బంగ్లాదేశ్ బ్యాంక్ దుస్తువులపై ఆంక్షల ఆదేశాన్ని గురువారం ఉపసంహరించుకుంది. “ఈ సర్క్యులర్ పూర్తిగా సలహా మాత్రమే. హిజాబ్ లేదా బుర్ఖా ధరించడంపై ఎటువంటి బాధ్యత విధించబడలేదు” అని ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్ ఖాన్ స్పష్టం చేశారు.  లింగ సమానత్వ సంస్కరణలను వ్యతిరేకించే, షరియా ఆధారిత పాలనా నమూనాను అనుసరించాలని బంగ్లాదేశ్‌కు పిలుపునిచ్చే ఇస్లామిస్ట్ గ్రూపుల నుండి పెరుగుతున్న ఒత్తిడి మధ్య ఈ పరిణామాలు వచ్చాయి.
విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను “హిజాబ్ వ్యతిరేకులు” అని ముద్ర వేయడం నుండి “మహిళలపై పాశ్చాత్య చట్టాలకు” వ్యతిరేకంగా సామూహిక నిరసనలు నిర్వహించడం వరకు, జమాత్-చార్ మోనై, హెఫాజత్-ఇ-ఇస్లాం వంటి గ్రూపులు ఇటీవలి నెలల్లో తమ డిమాండ్లను తీవ్రతరం చేశాయి. యూనుస్ నేతృత్వంలోని పాలనలో పౌర స్వేచ్ఛలు కుంచించుకుపోతూనే ఉండటంతో, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య వ్యక్తీకరణ రెండింటినీ అణచివేయడానికి ఉద్దేశించిన కఠినమైన రాష్ట్ర విధానం ఏకీకరణకు పౌరులు,మరియు హక్కుల సంఘాలు భయపడుతున్నాయి.