2040 నాటికి శాటిలైట్లు 3 రెట్లు పెంపు

2040 నాటికి శాటిలైట్లు 3 రెట్లు పెంపు

* 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం

అంతరిక్షంలో ఉన్న ఉన్న ఉపగ్రహాల సంఖ్యను భారత్‌ రాబోయే రోజుల్లో మూడురెట్లు పెంచుతుందని ఇస్రో చైర్మన్‌ వీ నారాయణన్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు చెందిన శాటిలైట్లు ప్రస్తుతం 55 ఉన్నాయని పేర్కొన్నారు. “భారత అంతరిక్ష కార్యక్రమం – విజయాలు, సవాళ్లు, భవిష్యత్తు దిశ” అంశంపై  జిపి బిర్లా స్మారక ఉపన్యాసం ఇస్తూ  2040 నాటికి భారత్‌ స్పేస్‌ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలోని ఇతర దేశాలతో సమానంగా ఉంటుందని చెప్పారు. 
 
ఈ ఏడాది ఇస్రో 12 లాంచ్‌ వెహికిల్‌ మిషన్లను ప్లాన్‌ చేస్తోందని, ఇందులో నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ (నిసార్)ని భారత్‌ జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్‌ 16 జులై 30న ప్రయోగించనున్నట్లు తెలిపారు.  భారత్‌ 2035 నాటికి పూర్తిస్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుందని, మొదటి మాడ్యూల్‌ను 2028లో కక్ష్యలో ఉంచనున్నట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలు తీసుకువచ్చే పని జరుగుతుందని చెబుతూ గతంలో ఇస్రో సర్వీస్‌ బేస్డ్‌ మోడల్‌లపై పని చేసిందని, ఇప్పుడు వాణిజ్య అవకాశాలను వినియోగించు కోవాలనుకుంటున్నదని చెప్పారు. 

“ఇప్పుడు మేము మా సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి కృషి చేస్తున్నాం. సొంతంగా చంద్రయాన్ ల్యాండింగ్ చేస్తాం. ప్రస్తుతం మన దగ్గరనున్న 55 ఉపగ్రహాలు దేశంలోని సామాన్య ప్రజల సేవ (సర్వీసు) కోసం నిర్దేశించినవి. మరో మూడేళ్లలో వీటి సంఖ్యలను దాదాపు మూడు రెట్లు పెంచాల్సి ఉంది. ఎందుకంటే వీటి అవసరం అంతగా ఉంది. శాటిలైట్స్కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కనుక మేము కూడా ఆ దిశగా కృషి చేస్తున్నాం” అని ఇస్రో చైర్మన్ వివరించారు. 

చంద్రయాన్‌-3 విజయం తర్వాత భారత్‌తో జపాన్‌ భాగస్వామ్యం కావాలనే కోరికను వ్యక్తం చేసిందని చెబుతూ సంయుక్తంగా జాక్సాతో కలిసి చంద్రయాన్‌-5, లూపెక్స్‌ మిషన్‌పై కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. ఉపగ్రహాన్ని కలిసే తయారు చేస్తున్నామని, దాన్ని జపాన్‌ ప్రయోగిస్తుందని పేర్కొన్నారు. 

చంద్రయాన్-3 ల్యాండర్ 1,600 కిలోలు, కొత్త ఈ కొత్త మిషన్ 6,600 కిలోలు బరువు ఉంటుందని డా. నారాయణన్ చెప్పారు. రాబోయే రెండేళ్లలో పెద్ద వార్తలు వింటారని పేర్కొంటూ రాబోయే మూడు నెలల్లో ఇస్రో అమెరికా 6,500 కిలోల కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత్‌ రాకెట్‌ నింగిలోకి తీసుకెళ్తుందని చెప్పారు. శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.4వేలకోట్ల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించిందని చెప్పారు. 

గగన్‌యాన్ మిషన్ కింద 2027 తొలి త్రైమాసికంలో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని భావిస్తున్నది. ఇదిలా ఉండగా, ఇస్రో ఇప్పటివరకు 3.4దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ఆయా దేశాలకు సొంతంగా సాంకేతిక లేకపోవడంతో వాటిని ఇస్రో ప్రయోగించింది. గత పదేళ్లలో ఇస్రో మొత్తం 518 ఉపగ్రహాలను ప్రయోగించిందని నారాయణన్ వివరించారు.