
ఓటీటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీలు, స్ట్రీమింగ్ వేదికలపై వేదికలపై నిషేధం విధించింది. అందులో ఉల్లు, ఏఎల్‌టీటీ సహా కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఆయా వెబ్‌సైట్లను కనిపించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఉల్లు, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్, దేశీఫ్లిక్స్, గులాబ్ యాప్ వంటివి పలుమార్లు నిబంధనలను ఉల్లంఘించి అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించామని కేంద్రం తెలిపింది.
అందుకే వాటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఓటీటీ ప్రసార యాప్‌లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది. ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్, బిగ్ షాట్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్, హిట్‌ప్రైమ్, ఫినియో, షోఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్ వీఐపీ, హల్‌చల్ యాప్, మూడ్‌ఎక్స్, నియాన్‌ఎక్స్ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్, ట్రైఫ్లిక్స్ లపై చర్యలు తీసుకుంది.
ఇటీవల జాతీయ మహిళా కమిషన్తోపాటు పలువురు రాజకీయ నాయకులు ఉల్లు ప్లాట్ ఫామ్పై మండిపడ్డారు. మే నెలలో బిగ్ బాస్ మాజీ కంటెస్టంట్ అజాజ్ ఖాన్ నటించిన హౌస్ అరెస్ట్ వెబ్ సిరీస్కు చెందిన ఒక క్లిప్ అసభ్యకరమైన కంటెంట్తో ఉండడంతో వైరల్ అయింది. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉల్లు విమర్శలకు గురైంది. శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహా పలువురు నాయకులు ఆ కంటెంట్ను ఖండించారు.
“ఉల్లు, ఆల్ట్ బాలాజీ వంటి యాప్‌లు అశ్లీల కంటెంట్ ప్రదరిస్తున్నా I&B మంత్రిత్వ శాఖ నిషేధం నుంచి తప్పించుకోగలిగాయని నేను స్టాండింగ్ కమిటీలో లేవనెత్తాను. నేను ఇప్పటికీ వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను” అని ఆమె తెలిపారు. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్ కూడా ఆ సిరీస్‌ను సుమోటోగా స్వీకరించింది. పూర్తి నిషేధంతో సహా నియంత్రణ చర్యలకు డిమాండ్ చేసింది. ఇప్పుడు కేంద్రం ఆ యాప్పై కొరడా ఝళిపించింది.
More Stories
బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం
చట్టవిరుద్ధమని తేలితే బిహార్‌లో ఎస్ఐఆర్ ను రద్దు చేస్తాం
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి