హిందుత్వం గొప్ప తనాన్ని చాటిన వ్యక్తి కోటా

హిందుత్వం గొప్ప తనాన్ని చాటిన వ్యక్తి కోటా

హిందుత్వం గొప్పతనాన్ని చాటిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ వీ ఎన్ మాధవ్ కొనియాడారు. సామాజిక సమస్యలపై, సినీరంగలోని సమస్యలపై నిర్మొహమాటంగా తన గళాన్ని వినిపించే వారని తెలిపారురు. రాజకీయాలను సినీ జీవితాన్ని సమానంగా  బ్యాలెన్స్ చేస్తూ ప్రధాని మోదీ సభల్లో కూడా తన బలమైన వాణిని వినిపించారని తెలిపారు.
 
విజయవాడలో జరిగిన ప్రముఖ సినీ నటుడు, మాజీ బిజెపి ఎమ్యెల్యే కోటా శ్రీనివాసరావు సంస్మరణ సభలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ అన్ని భాషల్లోనూ, యాసల్లోనూ వైవిధ్య భరితమైన పాత్రల్లో అలవోకగా పరకాయ ప్రవేశం చేసి తనకు తానే సాటి అని కోట నిరూపించుకున్నారని తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వలన రాలేకపోయిన బీజేపీ నేత, మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ ఫోన్ ద్వారా లైవ్ లో మాట్లాడుతూ  కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బొబ్బిలి రాజా సినిమాలో కలిసి నటించామని, మామగారు సినిమా నుంచి తమ ఇద్దరి జైత్ర యాత్ర కొనసాగిందని పేర్కొన్నారు. 
 
మూడు దశాబ్దాల పాటు గురు శిష్యులుగా, అన్నదమ్ములుగా,హిట్ పెయిర్ గా నిలిచామని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆయన పాత్రలు సజీవంగా  నిలిచి ఉంటాయని బాబు మోహన్ తెలిపారు. కోట శ్రీనివాసరావును భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని చెబుతూ సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఆయన నటన గుర్తుండి పోతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ చెప్పారు.  9 నంది అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలిపారు.  
 
సమర్థవంతమైన నాయకత్వంతో  రాజకీయాలకు వన్నె తెచ్చారని, 1999 నుండి 2004 వరకు  విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా సేవలందించారని గుర్తు చేశారు. పట్టణ ప్రాంతాల్లోనీ ప్రజల సొంత ఇంటి కలను కోటా శ్రీనివాసరావు సాకారం చేశారని చెప్పారు. ఆయన ఆలోచనలను అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం రూపకల్పన చేసి వాంబే కాలనీలను నిర్మించిందని పేర్కొన్నారు. 
 
 కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి  కామినేని శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు  సామినేని ఉదయభాను, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో  అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, బీజేపీ జాతీయ ఎస్సి మోర్చా కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజి తదితరులు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించారు.