జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తొలగింపుకై లోక్ సభలో తీర్మానం

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ తొలగింపుకై లోక్ సభలో తీర్మానం

అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను తొలగించేందుకు సిద్ధం చేసిన ప్రతిపాదనను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ప్రకటించారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు అంగీకరించాయని ఆయన వెల్లడించారు. ఈ తీర్మానానికి మద్దతుగా అధికారంలోని కూటమి, ప్రతిపక్ష పార్టీలకు చెందిన 150 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారని తెలిపారు.

‘ఎటువంటి సందేహం లేకుండా ఉండండి. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించే ప్రక్రియ లోక్సభలో జరుగుతుంది’ అని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.  మరోవైపు యశ్వంత్‌ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు స్పీకర్‌ ఓం బిర్లా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ఇటువంటి తీర్మానం కోసం ప్రతిపక్షాలు సమర్పించిన నోటీసును ఎగువ సభ ఆమోదించలేదని, దిగువ సభలో ఈ ప్రక్రియను ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

డిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ఆవరణలో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన కరెన్సీ కట్టలు బయటపడటంతో వివాదం మొదలైంది. దీనిపై అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నోట్ల కట్టలు దొరికింది నిజమేనని పేర్కొంది. 

దీంతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్, వర్మకు సూచించారు. అయినా తన పదవికి రాజీనామా చేయడానికి వర్మ నిరాకరించారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు సిఫారసు చేస్తూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ఇచ్చారు. 

తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ జస్టిస్ వర్మ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వర్మ పిటిషన్ నుంచి తప్పుకుంటున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. విచారణ కమిటీలో తాను ఉన్నందున దాన్ని మరో బెంచ్కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు.