
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు శనివారం గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై స్థానంలో రాజ్ భవన్‌లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కె. రామ మోహన్ నాయుడు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రజలకు సేవ చేస్తూనే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తానని రాజు (74) పేర్కొన్నారు. “మనమందరం ఒక జట్టుగా పనిచేస్తాము. నాకు స్థానిక భాష అర్థం కాకపోయినా, ఈ (గవర్నర్) కార్యాలయంలో ఇది నా మొదటి నియామకం అయినప్పటికీ, నేను రాజకీయ రంగంలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌ను గడిపాను. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడటానికి ముందు నేను ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను, కొద్దీ కాలం పార్లమెంటుసభ్యునిగా ఉన్నాను” అని ఆయన తెలిపారు.
“నేను ప్రభుత్వంలో మంత్రిగా, ప్రతిపక్షంలో కూడా ఉన్నాను. నాకు విస్తృత అనుభవం ఉంది” అని గవర్నర్ చెప్పారు. ఆయన గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మే 27, 2014 నుండి మార్చి 10, 2018 మధ్య పౌర విమానయాన మంత్రిగా పనిచేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ వంటి కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు. ఆయన ఏపీ శాసనసభ స్పీకర్ కూడా ఉన్నారు.
గోవా ప్రజలతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. కలిసి పనిచేయడం ద్వారా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “భారతదేశం ప్రపంచంలో ఎవరికన్నా తక్కువ కాదు” అని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో బిజెపి కాకుండా ఎన్డీఏ మిత్రపక్షాల నుండి గవర్నర్‌గా నియమితులైన మొదటి వ్యక్తి అశోక్ గజపతి రాజు. తెలుగుదేశం పార్టీ నుండి గవర్నర్ అయిన మొదటి వ్యక్తి కూడా ఆయన.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు. ఆయన కుమార్తె ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏపీ స్పీకర్ సిహెచ్. అయ్యన్న పాత్రుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, పలువురు టీడీపీ ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అశోక్ గజపతి రాజు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయవేత్తగా ఆయనకు వివాదరహితుడిగా పేరుంది. మహారాజా అలక్‌నారాయణ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా అశోక్ గజపతి రాజు చేశారు.
More Stories
కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!