పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తహసీల్దార్!

పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తహసీల్దార్!
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి మందిరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధాక్షణంగా కూల్చివేసింది. గురువారం షేక్ పేట ఎమ్మార్వో అనిత రెడ్డి పంతం బట్టి మందిరాన్ని కూల్చి వేసేదాకా కదలలేదు. వర్షం పడుతుందా గొడుగు పట్టుకొని, సిబ్బందిని పురమాయించి మందిరాన్ని ధ్వంసం చేసింది. వీరికి మద్దతుగా పోలీసు సిబ్బంది, ఏసిపి దగ్గరుండి విగ్రహాన్ని  కూల్చారు. 
 
బోనాలు ముగిసిన మరుసటిరోజే మంగళవారం రాత్రి ప్రహరీ, గుడి పైకప్పును అధికారులు కూల్చివేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన  బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. ఈ కారణంగా వెనక్కి తగ్గినట్టు నటించిన రెవెన్యూ అధికారులు  మందిరాన్ని కూల్చివేశారు. అయితే గురువారం ఉదయం నుంచే స్థానిక కాలనీవాసులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున షేక్ పేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 
 
ఇది పురాతన ఆలయమని, తర తరాలుగా పూజలు చేస్తున్న మందిరాన్ని కూల్చవద్దని శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. అయితే ఇది తన పరిధిలో లేదని కలెక్టర్ గారిని కలవాలని ఎమ్మార్వో, సిబ్బంది తప్పించుకున్నారు. దీంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎమ్మార్వో కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. 
 
ఈలోపు జోరుగా వర్షం కురుస్తుంది. ఇదే అదునుగా భావించిన ఎమ్మార్వో తన సిబ్బందిని తీసుకొని పోలీసుల సహకారంతో భారీ వర్షంలో మందిరాన్ని కూల్చివేసింది. అటువైపు ఎవరు రాకుండా పోలీసు సహకారాన్ని తీసుకొని మందిరాన్ని నేలమట్టం చేసింది. అయితే కలెక్టర్ కూడా బజరంగ దళ్ కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కూల్చివేతను అడ్డుకొనేందుకు  వచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 
తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన కొనసాగుతున్నదని, హిందువులకు భరోసా, భద్రత కరువైందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం పరిపాలన మించిన  హిందూ వ్యతిరేక పాలన కొనసాగుతోందని ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనికంతటికి మూల కారణమైన షేక్ పేట ఎమ్మార్వోను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
హిందూ సమాజమంతా ఒక్కటై ఆందోళన చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను గౌరవించాలని, మందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. బిజెపి నాయకురాలు మాధవి లత సంఘటన స్థలాన్ని సందర్శించి అధికారుల తీరును పడుతూ మందిరం కూల్చివేత అక్రమమని ఆరోపించారు. దీంతో ఆమెను కూడా పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.