
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారం కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆమె హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం ఇప్పటికే నిందితురాలిగా తేల్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆమె పాత్రపై సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) విచారణ జరపనుంది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌ను 2022 అక్టోబరులో సీబీఐ కోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలుచేశారు. గతంలో దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. ఆమెను కేసు నుంచి తప్పిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే.
దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీచేయడం సరికాదని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలంటూ ఈ పిటిషన్‌ను తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపింది. దీన్ని మూడు నెలల్లో తేల్చాలని సర్వోన్నత న్యాయస్థాను ఆదేశించింది.
2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఓఎంసీ(ఓబులాపురం మైనింగ్ ) మైనింగ్ లీజ్ వ్యవహారం ముందుకు సాగిందని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఓఎంసీ లీజులు కట్టబెట్టడానికి అమె అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) హైకోర్టుకు నివేదించింది.
ఈ కేసులో ఆరో నిందితురాలైన శ్రీలక్ష్మి వాస్తవాలను తొక్కిపెట్టి మరోసారి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారంటూ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ వివరించింది. గతంలో ఇదే కేసులో ఆమె పిటిషన్లను ఈ హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేసింది. ఈ విషయాన్ని ప్రస్తుత రివిజన్ పిటిషన్‌లో ప్రస్తావించకుండా మరోసారి పిటిషన్ దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఓఎంసీకి లీజుల మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా స్పష్టమైన ఆధారాలున్నాయని, కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్‌ను తోసిపుచ్చింది.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!