
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు బీసీలను మోసం చేయాలని చూస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీలలో ముస్లింల రిజర్వేషన్లను 4 శాతం నుండి 10 శాతంకు పెంచడం ద్వారా ఆచరణలో బిసిల రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న 34 శాతం నుండి 32 శాతంకు కుదింపబోతున్నారని ఆయన హెచ్చరించారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు బీసీ-ఈ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, రిజర్వేషన్లు రాజ్యంగవిరుద్ధమని, ఇలాంటి రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు రెండుసార్లు తీర్పునిచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయినా సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకుని అమలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కులగణన పేరుతో బీసీ జనాభాను భారీగా తగ్గించే ప్రయత్నం చేసిందని పేర్కొంటూ 56 శాతం బీసీలని చెబుతూ వారిలో ముస్లింలను 10 శాతం చూపించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజమైన బీసీలు 46 శాతం మాత్రమే ఉన్నారని చెబుతూ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల్లో ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఎవరికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటోందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో చేతి వృత్తులపై ఆధారపడి పనిచేసే కులాలకు మాత్రమే రిజర్వేషన్లు అందించారని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లలో కూడా ముస్లిం వర్గాలు కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పారు. మళ్లీ బీసీ రిజర్వేషన్లతో కలిపి ముస్లింలకు రాజ్యంగ విరుద్ధంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ప్రయత్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ధ్జమెత్తారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కుట్ర పన్నారని చెబుతూ 150 మున్సిపల్ డివిజన్లు ఉంటే 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేసి, ఆ 50 బీసీ సీట్లలో బీసీయేతరులైన మజ్లిస్ పార్టీకి చెందిన వారే గెలిచారని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట మళ్లీ ముస్లింలకే లబ్ధి చేకూర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. బీసీలను ఏదో ఉద్ధరించామన్నట్టు ఢిల్లీలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ భుజాలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి