మొఘల్‌ చరిత్రను తిప్పి చూడాలి

మొఘల్‌ చరిత్రను తిప్పి చూడాలి
 
* హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్

మొఘల్‌ చరిత్రను తిప్పి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మన చరిత్రలో మన రాజులకు సరైన గుర్తింపు దక్కలేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ సూచించారు. తాను నటించిన ‘‘హరిహర వీరమల్లు’’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం జరిగిన సక్సెస్‌ మీట్‌లో ప్రసంగిస్తూ చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి మంచితనాన్ని తక్కువగా చెప్పి ఇతర దేశాల నుంచి వచ్చి మనల్ని పాలించిన వారి గొప్పతనాన్ని ఎక్కువగా చెప్పారనిపిస్తుందని విచారం వ్యక్తం చేశారు. 

భారతదేశాన్ని కేవలం 200 ఏళ్లపాటు పాలించిన మొఘల్స్ గురించిన మంచితనం అధికంగా ప్రస్తావించారని చెప్పారు. బాబర్, అక్బర్, షాజహాన్ వంటి మొఘల్ రాజుల గొప్పతనాన్ని ఎక్కువగా చూపించి, ఔరంగజేబు వంటి రాజు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదని విమర్శించారు. మన కాకతీయ రాజులు, కృష్ణదేవరాయులు, రాణి రుద్రమ వంటి పరిపాలకుల చరిత్ర తక్కువగా కనిపిస్తుందని తెలిపారు. 

అందుకే ఔరంగజేబు కాలంలో  హిందువుగా బతకాలంటే జిజియా పన్ను కట్టే దారుణమైన రోజులను హరిహర వీరమల్లు చిత్రంలో సునిశితంగా చర్చించామని గుర్తు చేశారు. ఔరంగజేబు చనిపోయి ఇంతకాలమైనా అప్పటి దారుణాలను చెప్పాలంటే ఇప్పటికి చాలా మంది భయపడతారని విస్మయం వ్యక్తం చేశారు.   చరిత్రలో జరిగిన విషయాలను హరిహరవీరమల్లు చిత్రం ద్వారా ప్రజలకు తెలిసేలా చెప్పడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.

“ఔరంగజేబు కాలంలో చీకటి రోజులను ఆ కాలంలో సామాన్యులు పడిన ఇబ్బందులను చిత్రంలో చక్కగా చూపించాం. మొఘల్స్ సామ్రాజ్యంలో మంచితోపాటు చెడును చెప్పాలన్నదే ప్రధానమైన ఉద్దేశం” అని తెలిపారు.  “నేను ఏమీ చేసినా భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, దేశ ఉన్నతిని బలంగా చెప్పాలని చూస్తాను. నా మనసు అంతా భారతదేశపు ఆత్మ నిండిపోయి ఉంది. చిత్రం పార్ట్-2 కూడా 20 శాతం పూర్తయ్యింది. దీనిలో ఖాన్ అబ్దుల్ గఫూర్ ని దృష్టిలో పెట్టుకొని కొంత భాగం చిత్రీకరించాం” అని పవన్ కళ్యాణ్ వివరించారు. 

ఒకప్పుడు భారతదేశంలో విదేశీ సంగీతం విస్తృతంగా వ్యాప్తి చెందిన సమయంలో భారతీయ సంగీతం గొప్పతనాన్ని, దాని ప్రాముఖ్యాన్ని అత్యంత అద్భుతంగా ప్రేక్షకులకు చూపించిన సినిమా శంకరాభరణం అని గుర్తు చేశారు. ఆ సినిమా చూసిన తరువాత కర్ణాటక సంగీతం మీద, భారతదేశపు సంగీతం ఔన్నత్యం మీద గొప్ప అభిప్రాయం ఏర్పడిందని తెలిపారు.  కోహినూర్ వజ్రం కంటే విలువైన గొప్ప ధర్మం భారతదేశంలో ఉందని చెబుతూ వేదాలు, ఉపనిషత్తులు, జ్ఞానం, విజ్ఞానం, కలగలిపిన గొప్ప భూమి ఇదని తెలిపారు. దీనినే చిత్రంలోనూ చూపించామని చెప్పారు.