ప్రపంచ కప్ చెస్ ఫైనల్‌కు దివ్య దేశ్‌ముఖ్, హంపి

ప్రపంచ కప్ చెస్ ఫైనల్‌కు దివ్య దేశ్‌ముఖ్, హంపి
ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌లో మొదటిసారిగా ఇద్దరు భారత ప్లేయర్లు  ఫైనల్ కు చేరుకొని ఒకరిపై మరొకరు కప్ కోసం పోటీపడబోతున్నారు.  ఇప్పటికే ఈ మెగాటోర్నీలో భారత యువ ప్లేయర్‌ దివ్యదేశ్‌ముఖ్‌ ఫైనల్లోకి దూసుకెళ్ళి సంచలనం సృష్టించగా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన సెమీస్‌ పోరులో హంపి 5-3 తేడాతో చైనా చెందిన టింగ్జి లీపై అద్భుత విజయం సాధించింది.  శనివారం నుంచి టోర్నీ ఫైనల్‌ పోరు మొదలుకానుంది.
 
తొలి రెండు గేములు స్కోర్లు సమం కావడంతో పోరు టైబ్రేక్‌కు దారితీసింది. మొత్తం ఎనిమిది రౌండ్లలో రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యం చేతులు మారుకుంటూ వచ్చింది. ర్యాపిడ్‌ స్టయిల్‌లో తొలి రెండు టైబ్రేక్‌లు డ్రా కావడంతో ఇద్దరి ప్లేయర్ల స్కోర్లు 2-2తో సమైంది. అయితే మూడో ర్యాపిడ్‌ రౌండ్‌లో హంపి తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న టింగ్జి విజయం సాధించడంతో స్కోరు 3-2కు చేరుకుంది. 
 
వెంటనే పుంజుకున్న హంపి నాలుగో రౌండ్‌లో తెల్లపావులతో..చైనా ప్లేయర్‌కు చెక్‌ పెట్టడంతో స్కోరు 3-3కు చేరుకుంది. అటు తర్వాత జరిగిన రెండు బ్లిట్జ్‌ గేముల్లో హంపినే విజయం వరించింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో టింగ్జి భరతం పట్టిన హంపి ఆధిక్యాన్ని 4-3కు పెంచుకుంది. అదే దూకుడుతో ఆఖరిదైన రెండో గేమ్‌లో నల్లపావులతో చైనా ప్లేయర్‌ను ఓడించడంతో హంపి గెలుపు ఖరారైంది. ఫైనల్‌కు క్వాలిఫై అవడంతో క్యాండిడేట్స్‌ టోర్నీకి హంపి అర్హత సాధించింది. మూడో స్థానం కోసం జరిగే వర్గీకరణ పోరులో చైనా ప్లేయర్లు టింగ్జి లీ, టాన్‌ జాంగ్జి తలపడనున్నారు.
అంతకు ముందు చెస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌ కు చేరి చరిత్ర సృష్టించింది. ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలే అయినా, ఆమె ప్రతిభ అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనించింది. మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ ఝోంగీను 1.5-0.5 తేడాతో ఓడించి ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది. ఈ విజయంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, దివ్య నల్ల పావులతో అద్భుతమైన వ్యూహం ప్రదర్శించి, దూకుడుగా తన గేమ్‌ను నడిపింది.
 
రెండో గేమ్‌లో ఆమెకు తెల్లపావులతో ఆడటం ప్రయోజనకరంగా మారింది.  ఆమె మిడ్ గేమ్‌లో తాన్ ఝోంగీ చేసిన తప్పులను సొమ్ముగా మార్చుకుంది. దివ్య తన నైపుణ్యాన్ని విజయంగా మార్చుకుంది.  ఈ గెలుపు భారత మహిళా చెస్‌కు గొప్ప విజయం. దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు చేరుకునే క్రమంలో అనేక గొప్ప క్రీడాకారిణులు ఓడించింది. దివ్య నిర్భయంగా, దూకుడుగా చెస్ ఆడింది. తాన్ ఝోంగీ తన బలమైన ఆటతీరుకు ప్రసిద్ధి చెందింది. దివ్య ఆమెను ఓడించి మహిళా చెస్‌లో తాను ఒక కొత్త స్టార్ అని నిరూపించుకుంది.